CM Chandrababu Naidu: చేసిన మంచి చెబుదాం
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:49 AM
‘పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతులకు తగిన ధర లభించేలా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.273 కోట్లు నిధులు విడుదల చేసింది. దేశచరిత్రలోనే ఇలా చేయడం ప్రథమం.
రూ.273 కోట్లతో పొగాకు రైతును ఆదుకున్నాం
ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం
అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం
మంత్రులంతా ఇలాంటివాటిపై దృష్టి పెట్టాలి
రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి
జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఏడాది సంబరాలు
నెలాఖరులోపు డీఆర్సీ సమావేశాలు జరపాల్సిందే
ఏడాదిలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాలి
క్యాబినెట్ సమావేశంలో సీఎం దిశానిర్దేశం
ఇప్పటిదాకా మంచి చేసీ చెప్పుకోలేకపోతున్నాం
1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగాలి
మిత్రపక్షాల నేతలనుకలుపుకొని వెళ్లాలి
మంత్రులు ఎన్నికలహామీలపై దృష్టి పెట్టాలి
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ‘పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతులకు తగిన ధర లభించేలా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.273 కోట్లు నిధులు విడుదల చేసింది. దేశచరిత్రలోనే ఇలా చేయడం ప్రథమం. ఈ స్థాయిలో మంచి పనులు చేస్తున్నా, వాటిని చెప్పుకోవడంలో మనం విఫలమవుతున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులందరూ ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రుల నడుమ చర్చ జరిగింది. రైతుల పట్ల మనకున్న చిత్తశుద్ధికి.. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ ప్రజలకు ఇలాంటి విషయాలు చెప్పుకోలేకపోతున్నామని అన్నారు.
‘గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అభివృద్ధిపైనా దృష్టి సారించాం. రైతులను ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మంత్రులు చొరవ తీసుకుని ఈ విషయాలను ప్రజల్లో చర్చకు పెట్టాలి. ఈ ఏడాది పొగాకు రైతులకు జరిగినట్లు మున్ముందు ఇతర పంటల రైతులకు జరుగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పరిస్థితులను బట్టి.. డిమాండ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటల వైపు వారిని ప్రోత్సహించాలి. ఇందుకు మంత్రులు చొరవ చూపాలి. డిమాండ్‌కు తగ్గట్లు వాణిజ్య పంటలు వేసేలా చూడాలి. పురుగు మందుల వాడకంపై మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రైతులను చైతన్యపరచాలి’ అని కోరారు. ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాలను జిల్లా, నియోజకవర్గ స్థాయుల్లోనూ నిర్వహించాలని, జిల్లా స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇవి జరపాలని చంద్రబాబు ఆదేశించారు. జూలై 1 నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగడం ప్రారంభించాలని, కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని వెళ్లాలని చెప్పారు.

ఆర్థికేతర హామీలు త్వరగా అమలుచేయాలి..
ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలను వేరు చేయాలని చంద్రబాబు సూచించారు. ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని, ఆర్థికంగా ముడిపడినవాటిని రెండు నెలల్లో అమలు చేసేలా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రులను ఆదేశించారు.
డీఆర్సీ సమావేశాలపై నిర్లక్ష్యం వద్దు
జిల్లా ఇన్‌చార్జి మంత్రులు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశాలు తప్పకుండా నిర్వహించాలని, కొందరు మంత్రులు వాటిని సక్రమంగా జరుపడం లేదని సీఎం ఆక్షేపించారు. ఇప్పటి వరకు సమావేశాలు పెట్టని జిల్లాల్లో ఈ నెలాఖరులోపు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీలపై ఇన్‌చార్జి మంత్రులు సమీక్షించాలని, వాటి అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. వారు జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 3 నెలలకోసారి ప్లానింగ్ బోర్డు సమావేశం కావాలని, జిల్లాల్లో ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలివ్వాలన్నారు.
అభివృద్ధిని పరుగులెత్తించాలి..
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తాను 24/7 అందుబాటులో ఉంటానని, ఏడాదిలోపు రెవెన్యూ సమస్యలను నూరు శాతం పరిష్కరించేలా అడుగులు వేయాలని సీఎం నిర్దేశించారు. సాంకేతిక సమస్యల సాకుతో దాటవేత ధోరణి వీడాలని సూచించారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రతి మంత్రీ పని చేయాలన్నారు. పదవులు చేపట్టి ఏడాది పూర్తయిందని, ఇప్పటికే సబ్జెక్టుపై పట్టు వచ్చి ఉంటుందని, ఇకపై అభివృద్ధిని పరుగులెత్తించాలని స్పష్టంచేశారు.
ఆర్సెలార్ పనులు సెప్టెంబరులోనే..
అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమ పనులు ఈ ఏడాది అక్టోబరులో.. వీలైతే సెప్టెంబరులోనే ప్రారంభించి తొలి దశను 2028 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అమరావతిలో ప్రభుత్వపరంగా భారీ కన్వెన్షన్ హాలు నిర్మించాలన్నారు. వీలైనంత త్వరగా దీనిని అందుబాటులోకి తీసుకొస్తే భారీ ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సులువవుతుందని అభిప్రాయపడ్డారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ విజయవంతంపై సీఎం ప్రశంసలు కురిపించారు. మంత్రి కొల్లు రవీంద్ర బాగా చేశారని, ఈ తరహా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలని మంత్రులకు సూచించారు. పోలవరం, తిరుపతిలాంటి చోట్ల కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.