Share News

Minister Narayana: వైద్య విజ్ఞానాన్ని పంచుకోవటం ఆనందంగా ఉంది

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:43 AM

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన న్యూరాలజీ వైద్య నిపుణులు పాల్గొన్న సదస్సులో వైద్య విజ్ఞానాన్ని పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

Minister Narayana: వైద్య విజ్ఞానాన్ని పంచుకోవటం ఆనందంగా ఉంది

  • ఏపీ న్యూరోకాన్‌ సదస్సులో మంత్రి నారాయణ

నెల్లూరు (వైద్యం) జూలై 5 (ఆంధ్రజ్యోతి): దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన న్యూరాలజీ వైద్య నిపుణులు పాల్గొన్న సదస్సులో వైద్య విజ్ఞానాన్ని పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని నారాయణ వైద్య కళాశాలలో 32వ ఏపీ న్యూరోకాన్‌ సదస్సు రెండవ రోజు శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. ఈ వైజ్ఞానిక సదస్సు వల్ల రోగులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించే వీలుంటుందని తెలిపారు. ఇలాంటి మేధో సదస్సులు నారాయణ వైద్య కళాశాలలో నిర్వహించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నారాయణ విద్యాసంస్ధల డైరెక్టర్‌ పొంగూరు శరణి మాట్లాడుతూ న్యూరాలజీలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాలు, పరికరాల గురించి తెలుసుకోవటం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. సుమారు 700 మందికి పైగా వైద్యులు, 70 మందికి పైగా వక్తలు ఇందులో ప్రసంగిస్తారని తెలిపారు.


ఏపీ న్యూరోకాన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, నారాయణ ఆసుపత్రి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచే కాకుండా ఉత్తరాది నుంచి కూడా అనేక మంది వైద్యులు వచ్చారని తెలిపారు. మూర్ఛ, స్ట్రోక్‌, బ్యాక్‌ పెయిన్‌, పార్కిన్సన్‌ తదితర వ్యాధులకు సంబంధించి వినూత్న వైద్య విధానాలను ఈ సదస్సులో వైద్య నిపుణులు వివరిస్తారని చెప్పారు. అనంతరం ఏపీ న్యూరోకాన్‌ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ న్యూరో సైన్సెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఏవీ రమణమూర్తి, నెల్లూరు న్యూరోక్లబ్‌ అధ్యక్షుడు పీఎస్‌ రెడ్డి, నారాయణ వైద్య విద్యాసంస్ధల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బిజు రవీంద్రన్‌, నారాయణ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, నారాయణ ఏజీఎం శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 04:43 AM