Summer Heat : ఈసారి సెగలే!
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:35 AM
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం
ఉత్తరాదిలో 50 డిగ్రీలు దాటొచ్చు
మార్చి 15 తరువాత మరింత వేడి
విశాఖపట్నం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో ఎండ తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్ర తలు గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణం. కార్బన్ డయాక్సైడ్, మిథైన్, భారీగా పెరుగుతున్న నీటి ఆవిరితో ఏర్పడే గ్రీన్‌హౌస్ వాయువులతో భూమి మండుతోంది. ఈ ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. గత 124 సంవత్సరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన జాబితాలో జనవరి చేరింది. ప్రస్తుత ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఉత్తరాదిలో వెస్ట్రన్ డిస్టబెన్స్ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. 13వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 70 శాతం వర్షపాతం లోటు నమోదైంది. రానురాను ఎండ తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో లానినా కొనసాగుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు లానినా కొనసాగుతుందని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
నైరుతిలో వర్షాలూ ఎక్కువే!
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యం లో ఉష్ణోగ్రతలపై లానినా/ఎల్‌నినో/తటస్థ పరిస్థితులు ప్రస్తుతం ప్రభావం చూపే అవకాశం తక్కువేనని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు భానుకుమార్ చెప్పారు. భూమధ్యరేఖ సమీపాన లానినా కొనసాగితే వచ్చే నైరుతి రుతు పవనాలపై ప్రభావం ఉంటుందని, దీంతో మంచి వర్షాలు పడతాయన్నారు. గత 20 ఏళ్ల నుంచి వేసవిలో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రెండు మూడేళ్లు తప్ప మిగిలిన సంవత్సరాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయన్నారు. ఉత్తరాదిలో కొన్నిచోట్ల 50 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఎండలు బాగా పెరుగుతాయని, తద్వారా ప్రీమాన్‌సూన్ వర్షాలు సంభవిస్తాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి