Share News

Special Buses: ఆర్టీసీ కిటకిట

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:08 AM

సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

Special Buses: ఆర్టీసీ కిటకిట

  • తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సులూ ఫుల్లే

  • ఐదు రోజులు... 500 స్పెషల్స్‌

విజయవాడ, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 19వ తేదీ వరకు... 500 ప్రత్యేక బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కనుమ రోజున పెద్దగా ప్రయాణాలు ఉండవని ఆర్టీసీ అధికారులు భావించారు. వారి ఊహకు భిన్నంగా ప్రయాణాలు ప్రారంభం కావడంతో 15వ తేదీ బుధవారం నుంచే ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. బుధవారం ఒక్క రోజునే సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌ రూట్‌లో 45 ప్రత్యేక బస్సులు నడిపారు. రాత్రికి ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు. బెంగళూరు రూట్‌లో 4, చెన్నై రూట్‌లో 3 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇవి కాకుండా లోకల్‌గా మరో 10 బస్సుల వరకు నడిపారు. ఈ నెల 19 వరకు సెలవులు ఉండటంతో అప్పటి వరకు స్పెషల్‌ బస్సులు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ రూట్‌లో ప్రతి రోజూ సగటున 50 స్పెషల్‌ బస్సులకు తక్కువ కాకుండా నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


ప్రత్యేక బస్సులకూ రిజర్వేషన్‌ లేదు

తిరుగు ప్రయాణంలోనూ ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరకని పరిస్థితి. షెడ్యూల్‌ బస్సుల్లో పండగకు పక్షం రోజుల ముందే తిరుగు ప్రయాణాలకు టికెట్లు బుక్‌ అయ్యాయి. ఆర్టీసీ అధికారులు రోజుకు 50 చొప్పున ప్రత్యేక బస్సులకు కూడా రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. దీంతో దాదాపుగా ఇవి కూడా హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. మరిన్ని ప్రత్యేక బస్సులు ప్రకటించి రిజర్వేషన్‌ కల్పిస్తే తప్ప సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. కాగా, రైల్వే ఇప్పటికే విశాఖపట్నం-విజయవాడల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Jan 16 , 2025 | 05:08 AM