Share News

Fake Digital Arrest: ఆధార్‌ అమ్మేశారంటూ 93 లక్షలు స్వాహా

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:14 AM

డిజిటల్‌ అరెస్టు మోసం కొత్త పుంతలు తొక్కింది. సుప్రీం కోర్టు అరెస్టు చేయమని ఉత్తర్వులు ఇచ్చింది అంటూ ఓ విశ్రాంత..

Fake Digital Arrest: ఆధార్‌ అమ్మేశారంటూ 93 లక్షలు స్వాహా

  • విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలికి టోకరా

ఆకివీడు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘డిజిటల్‌ అరెస్టు’ మోసం కొత్త పుంతలు తొక్కింది. సుప్రీం కోర్టు అరెస్టు చేయమని ఉత్తర్వులు ఇచ్చింది అంటూ ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలిని బెదిరించిన మోసగాళ్లు దఫదఫాలుగా రూ.93 లక్షలు గుంజారు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకరపర్తి రాజరాజేశ్వరిది(64) పశ్చిమ గోదావరిజిల్లా ఆకివీడు. జూలై 25న ఆమెకు ఓ వీడియోకాల్‌ వచ్చింది. పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి కర్ణాటక గాంధీనగర్‌ ఎస్‌ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘మీ ఆధార్‌ నంబరుతో ఒక వ్యక్తి సెల్‌ నంబరు తీసుకొని అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు. మేం అతనిని అరెస్టు చేశాం. మీకు రూ.30 లక్షలు చెల్లించి మీ ఆధార్‌కార్డు కొనుగోలు చేసినట్లు చెపుతున్నాడు. ఆ మొత్తం మీ ఖాతాకు జమ చేశానంటూ మాకు ఆధారాలు చూపిస్తున్నాడు. మీ అరెస్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వస్తున్నాం’ అంటూ సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో రాజరాజేశ్వరి కంగారుపడ్డారు. తన ఆధార్‌ కార్డు తన వద్దే వుందని, ఎవరికీ అమ్మలేదని చెప్పారు. తన ఖాతాకు ఎలాంటి సొమ్ములు జమ కాలేదని పేర్కొన్నారు.


వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి... బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు తమకు పంపించాలని, పూర్తి స్థాయిలో తనిఖీ చేసి తప్పులేదని తేలితే వదిలేస్తామని, లేకుంటే చిక్కుల్లో పడతారని బెదిరించాడు. ఈ కేసు విషయం ఎవరికైనా చెపితే వాళ్లనూ అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె... తన ఖాతాల వివరాలను వారికి చెప్పింది. బంగారం తాకట్టు పెట్టి మరీ దఫదఫాలుగా తన ఖాతాలో రూ.93 లక్షలు జమ చేసింది. ఆ మొత్తాన్ని అవతలి వ్యక్తి నెల రోజుల్లో పది సార్లుగా డ్రా చేసేశాడు. ఆ తరువాత నుంచి ఆ వ్యక్తి ఫోన్‌ తీయడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జగదీశ్వరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ జయసూర్య ఆకివీడు వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:14 AM