Share News

Ration Dealers: రేషన్‌ తిప్పలు తప్పాయి

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:13 AM

రేషన్ సరుకుల పంపిణీ మళ్లీ రేషన్ డీలర్ల వద్దే ప్రారంభమైంది. ఇకపై లబ్ధిదారులు నెలలో 1 నుంచి 15 తేదీలలో ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చు.

 Ration Dealers: రేషన్‌ తిప్పలు తప్పాయి

  • ఇకపై రేషన్‌ డీలర్ల వద్దే సరుకుల పంపిణీ

  • నెలలో 15 రోజులు.. ఎప్పుడైనా తీసుకోవచ్చు

  • దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వారికి ఇళ్ల వద్దకే!

  • నాడు పేరుకే ‘ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ’

  • వీధి చివర్లోనే ఆగిన సరుకుల బండి

  • నడిరోడ్లపై క్యూ కష్టాలకు సర్కారు చెల్లుచీటీ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పేరుకే... ‘ఇంటింటికీ రేషన్‌ పంపిణీ’! సరుకుల బండి ఇంటింటి ముందూ ఆగిందీ లేదు. సరుకులు ఇచ్చిందీ లేదు. వీధి చివర్లో ఓ మూలకు ఆగి... సైరన్‌ కొడితే, లబ్ధిదారులు బిరాబిరా పరిగెత్తుకుంటూ రావాలి. నడిరోడ్డుపై క్యూలో నిలబడి సరుకులు తీసుకోవాలి. ఆ రోజు తప్పిందంటే... మళ్లీ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు! ఇదీ జగన్‌ హయాంలో పరిస్థితి! ఇప్పుడు ఆ కష్టాలకు కూటమి సర్కారు చెల్లు చీటీ రాసేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ఎండీయూ వ్యవస్థ రద్దయింది. రేషన్‌కార్డులు కలిగి ఉన్న 1.46 కోట్లకుపైగా కుటుంబాలకు తిరిగి 29,796 రేషన్‌ షాపుల ద్వారా సరుకులు అందిస్తోంది. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేయనున్నారు. ఆదివారాలు, పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి. లబ్ధిదారులు 15వ తేదీలోపు ఎప్పుడైనా తమకు తీరిక దొరికినప్పుడు సమీప రేషన్‌ షాపు వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. రేషన్‌ షాపులకు రాలేని దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్‌ డీలర్లు వారి ఇళ్ల వద్దకే సరుకులను అందిస్తారు.


ఇదేనా జగన్‌ ‘సేవ’?

జగన్‌ ‘గొప్ప’గా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పంపిణీతో తిప్పలు తప్పలేదు. ఇంటింటికీ సరుకులు సరఫరా చేయకుండా.. ఎక్కడో వీధి చివర్ల వాహనాన్ని నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో డోర్‌ డెలివరీ కాస్తా వీధి డెలివరీగా మారింది. వాహనం ఎప్పుడు వస్తుందోనని పనులు మాని పడిగాపులు కాయాల్సి వచ్చేది. వాహనం వచ్చినప్పుడు కార్డుదారులు అందుబాటులో లేకుంటే ఇక ఆ నెలకు సరుకులు పొందే అవకాశం కోల్పోయినట్టే. లేదా వాహనం ఎక్కడుందో అంటూ వీధుల వెంట తిరగాల్సిన దుస్థితి. వరుసగా మూడు నెలలు రేషన్‌ తీసుకోకపోతే కార్డులు రద్దయిపోతాయన్న భయంతో కూలిపనులు, చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరీ రేషన్‌ వాహనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అందరికీ పంపిణీ చేయకపోవడంతో మిగిలిపోయిన బియ్యాన్ని కూడా పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు రాసుకుని కాజేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు కిలో పది రూపాయల చొప్పున రేషన్‌ వాహనాల నిర్వాహకులే కొనుగోలు చేసి.... అవే వాహనాల్లో అక్రమ రవాణా చేసిన ఉదంతాలూ బయటపడ్డాయి. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర పోర్టుల ద్వారా వేలాది టన్నులు తరలిపోయాయి. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ బియ్యం చెలరేగిపోయింది.


ప్రభుత్వంపై పెను భారం...

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ... రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా పరిణమించింది. 9,260 రేషన్‌ వాహనాల కొనుగోలుకు సంబంధించిన బ్యాంకు వాయిదాలు, వడ్డీల భారం, జీతాల చెల్లింపు... మూడేళ్లలో దాదాపు రూ.1800 కోట్లు ఖర్చుపెట్టారు. వాహన నిర్వాహకులకు ప్రతినెలా రూ.21వేలు జీతం చెల్లించాలి. ఇంత చేసినా లబ్ధిదారులకు మేలు జరుగుతోందా అంటే అదీ లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే, ఎండీయూ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అదే సమయంలో... వాటి డ్రైవర్లు ఇబ్బంది పడకుండా ఆ వాహనాలపై ఉన్న బ్యాంకు రుణ బకాయిలను సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుంది. ఆ వాహనాలు పూర్తిగా డ్రైవర్ల సొంతం కానున్నాయి. వాటి ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.


పండుగ వాతావరణంలో పంపిణీ

తొలిరోజే సరుకులు తీసుకున్న 15 లక్షలకుపైగా కార్డుదారులు

రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని ప్రభుత్వం పునరుద్ధరించడంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో రేషన్‌ పంపిణీ జరిగింది. డీలర్లు రేషన్‌ షాపులను పూలతో అలంకరించారు. స్థానిక కూటమి నాయకులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా సరుకుల పంపిణీని ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా కార్డుదారులు సరుకులు తెచ్చుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు లక్ష మందికిపైగా రేషన్‌ తీసుకున్నారు.

Updated Date - Jun 02 , 2025 | 03:19 AM