Tulasibabu Bail Petition: తులసిబాబు బెయిల్ పిటిషన్.. నిర్ణయం ఆ రోజే వెల్లడిస్తామని చెప్పిన హైకోర్టు
ABN , Publish Date - Feb 11 , 2025 | 03:53 PM
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్‌లో వాదనలు ముగిసాయి. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్‌లో వాదనలు ముగిసాయి. ఫిబ్రవరి 14న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. అప్పటి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కార్యాలయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కామేపల్లి తులసి బాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తులసి బాబు గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు ఈ నెల 8న అరెస్టు అయ్యాడు. అరెస్ట్ అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో తనకు బెయిల్ ఇవ్వాలని నిందితుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ వేయగా అందుకు న్యాయస్థానం అనుమతించింది.
ఇదిలా ఉంటే, రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసినా ఎలాంటి గాయాలు లేవని మెడికల్ రిపోర్ట్ మార్చారని గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టులో ఆరు వారాల పాటు ప్రభావతి ఊరట పొందారు. ఇటీవల ఎస్పీ కార్యాలయంలో ఆమె విచారణకు హాజరైయ్యారు.