Share News

TDP : ఇంటి లోగుట్టు తేల్చండి

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:40 AM

పేదలకే ఇళ్ల స్థలాలు మంజూరయితే ఇప్పటిదాకా 9 లక్షల మంది ఎందుకు పట్టాలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది.

TDP : ఇంటి లోగుట్టు తేల్చండి

  • ప్రతి నవరత్న లబ్ధిదారుడి డేటా తనిఖీ

  • పరిశీలనకు ప్రత్యేక యాప్‌

  • 18 ప్రశ్నలతో వెరిఫికేషన్‌

  • అనర్హులను గుర్తించేందుకు చర్యలు.. స్పెషల్‌ డ్రైవ్‌కు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పీఐ) పథకం కింద లబ్ధిపొందిన వారెవరు? వారంతా నిజమైన పేదలేనా? లేక వైసీపీ కార్యకర్తలు ఇళ్ల పట్టాలు పొందారా? నిజమైన పేదలకే ఇళ్ల స్థలాలు మంజూరయితే ఇప్పటిదాకా 9 లక్షల మంది ఎందుకు పట్టాలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జగన్‌ సర్కారు 32 లక్షల మంది పేదలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామని గొప్పలు చెప్పగా, అందులో 9 లక్షల మంది పట్టాలే తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ 9 లక్షల మంది ఎవరు? పట్టాలు తీసుకున్నవారిలో అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? అన్నది నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ కింద పున:పరిశీలన ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. 18 రకాల ప్రశ్నలు, వాటి అనుబంధ సమాచారంతో అసలైన లబ్ధిదారులు ఎవరో నిర్ధారించేందుకు మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది. సోమవారం నుంచి ఆ యాప్‌తో లబ్ధిదారుల పున:పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. జిల్లా కలెక్టర్‌లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ జి.జయలక్ష్మి ఆదేశించారు.


జగన్‌ సర్కారు నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్లు పథకం కోసం రూ.18 వేల కోట్లు వ్యయం చేసింది. ప్రైవేటు భూమి 28 వేల ఎకరాలు సేకరించింది. తొండలు గుడ్లు పెట్టని భూములను కూడా అధిక ధరకు కొని పేదలకు ఇళ్ల స్థలాలుగా మార్చేసింది. భూసేకరణే పెద్ద కుంభకోణం అయితే.. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక మరో దారుణం. వైసీపీ నేతలు, కార్యకర్తలు, వారి అనుచరుల పేరిట భారీగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు ఆధారాలు వెలుగుచూశాయి. అధికారికంగా 9 లక్షల మంది పేదలు లబ్ధిదారులుగా ఎంపికయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పట్టాలు తీసుకోలేదు. కానీ జగన్‌ సర్కారు మాత్రం 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, కాలనీలు కాదు ఏకంగా ఊర్లే నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయి పరిస్థితులు జగన్‌ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ పేదలకు కేటాయుంచిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు. పట్టాలున్నవారు తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకంలో భారీ గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.


తహసీల్దార్లతో విచారణ బృందాలు

గ్రామం, వార్డుల వారీగా లబ్ధిదారుల జాబితాను పున:పరిశీలన చేయనున్నారు. రెవెన్యూ శాఖ తయారు చేసిన మొబైల్‌ యాప్‌ ద్వారా... ఇళ్ల స్థలాలు పొందినవారు నిజమైన లబ్ధిదారులా? లేక రాజకీయ కార్యకర్తలా? వారికి ఇంతకుముందే ఇళ్ల స్థలాలు ఇచ్చారా? సొంత ఇల్లు ఉన్నా ప్రభుత్వం స్థలం తీసుకున్నారా? వంటి కీలకమైన సమాచారం రాబట్టబోతున్నారు. ఇందుకోసం తహసీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సీసీఎల్‌ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. విచారణ బృందంలో తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్‌ఓ, సర్వేయర్‌లు సభ్యులుగా ఉండాలని సూచించారు. విచారణ అనంతరం డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు పక్షం రోజుల్లో లబ్ధిదారుల పున:పరిశీలన ప్రక్రియను పూర్తిచేయాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 02:40 AM