Education Department: విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల బంతాట
ABN , Publish Date - May 19 , 2025 | 04:22 AM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు, పరీక్షలు, సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాలను అవమానిస్తున్నాయి. రీయింబర్స్‌మెంట్ ఆలస్యం పేరిట విద్యార్థులపై ఒత్తిడి తేవడమే కాకుండా ఫైన్లు వసూలు చేస్తున్నాయి.
ఫీజుల నుంచి పరీక్షల వరకు యాజమాన్యాల ఇష్టారాజ్యం
రీయింబర్స్ ఆలస్యంతో ఒత్తిడి.. కొన్నిచోట్ల రోజువారీ ఫైన్లు
డబ్బులు కడితేనే పరీక్షలకు.. ఒరిజినల్ సర్టిఫికెట్లపైనా అంతే
అవి ఇస్తేనే అడ్మిషన్లని మెలిక.. తీసుకోవద్దన్న ఉన్నత విద్యా శాఖ
డ్రాపౌట్‌ల నుంచి పూర్తి ఫీజు.. 5 వేలకు మించొద్దన్నా బేఖాతరు
లబోదిబో మంటున్న విద్యార్థులు
ఇంజనీరింగ్ విద్యార్థులతో పలు ప్రైవేటు కాలేజీలు బంతాట ఆడుకుంటున్నాయి. ఫీజుల నుంచి పరీక్షల వరకు ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ‘ఫీజులు మేమే కడతాం..’ అని సర్కారు చెప్పినా.. విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇక, అడ్మిషన్ల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖే చెప్పినా పెడచెవిన పెడుతున్నాయి. ‘ఒరిజినల్స్ ఇస్తే తప్ప..’ అంటూ మెలిక పెడుతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. కొత్తగా చేరే విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ చెప్పినా వినిపించుకోవడం లేదు. సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి సొంత రూల్స్ అమలు చేస్తున్నాయి. అంతేకాదు, కోర్సు మధ్యలో మానేసిన విద్యార్థులకు వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించినా కాలేజీలు ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఒరిజినల్స్ తీసుకుని ఫీజులు కట్టే సమయంలో, సర్టిఫికెట్ల జారీ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ విషయంలో పదే పదే సమీక్షలు చేస్తున్నా సంస్థల తీరులో ఎలాంటి మార్పూ రావడం లేదు. పైగా ప్రభుత్వం కట్టాల్సిన ఫీజుల(రీయింబర్స్‌మెంట్)ను విద్యార్థులే చెల్లించాలంటూ ఇటీవల కొన్ని జిల్లాల్లో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. అంతేకాదు.. ఫీజులు చెల్లించని వారిని పరీక్షలు రాయకుండా అడ్డుకున్నాయి. అటు సర్టిఫికెట్ల జారీ, ఇటు పరీక్షలు, ఫీజుల విషయంలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాలను కాలేజీలు లెక్క చేయకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెలిక మామూలుగా లేదు!
ఏదైనా కోర్సులో అడ్మిషన్ పొందాలంటే విద్యా సంస్థలు దానికి ముందు చదివిన అర్హత కోర్సు సర్టిఫికెట్లను పరిశీలించి నిర్ధారించుకుంటాయి. ఇంజనీరింగ్, డిగ్రీ లాంటి కోర్సుల్లో చేరాలంటే టెన్త్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను పరిశీలిస్తాయి. పీజీ కోర్సుల్లో చేరితే టెన్త్, ఇంటర్‌తో పాటు డిగ్రీ సర్టిఫికెట్లను చూస్తారు. నకలు మాత్రమే తీసుకుంటాయి. కానీ, రాష్ట్రంలో దాదాపుగా అన్ని కాలేజీలు అడ్మిషన్ సమయంలో ఒరిజినల్స్‌ను తీసేసుకుంటున్నాయి. కోర్సు మొత్తం పూర్తయ్యాక ఫీజుల్లో ఎలాంటి వివాదం లేకపోతేనే వాటిని తిరిగి ఇస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే ఆ కాలేజీలో చదివిన కోర్సు సర్టిఫికెట్లతో పాటు అడ్మిషన్ల సమయంలో తీసుకున్న ఒరిజినల్స్ కూడా ఇవ్వడం లేదు. అలాగే కోర్సులో చేరిన కొంతకాలం తర్వాత విద్యార్థులు కాలేజీ మారాలనుకున్నా, డ్రాప్ అవ్వాలనుకున్నా ఒరిజినల్ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని మొత్తం ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రస్తుతం చదువుతున్న కోర్సు ఫీజులు ప్రభుత్వం విడుదల చేయకపోయినా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి.
ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు
విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుల విషయంలో ఈ ఏడాది జనవరిలో ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా కోర్సులో చేరిన విద్యార్థి అడ్మిషన్ వద్దనుకుని మధ్యలోనే మానేస్తే.. మొత్తం ఫీజులో గరిష్ఠంగా 5 శాతం(రూ.5 వేలు మించకుండా) మినహాయించుకుని అడ్మిషన్ ఉపసంహరణకు అనుమతించాలి. అదేవిధంగా విద్యార్థి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ఫీజు వెనక్కి ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించే విద్యార్థులు సీటు వద్దనుకుంటే ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదు. మార్కుల షీట్లు, స్టడీ సర్టిఫికెట్లతో సహా ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు తీసుకోకూడదు. అడ్మిషన్ సమయంలో ఒరిజినల్స్‌ను పరిశీలించి తిరిగి విద్యార్థులకు ఇచ్చేయాలి. ఒకవేళ వాటిపై ఏవైనా అనుమానాలుంటే, వాటిని జారీచేసిన అథారిటీ పరిశీలనకు పంపించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయకూడదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అదనంగా కట్టాలని డిమాండ్ చేయకూడదు.
జగన్.. మూడు క్వార్టర్లు పెండింగ్
2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం మొదటి క్వార్టర్‌కు రూ.788 కోట్లు విడుదల చేసింది. రెండో క్వార్టర్ ఫీజులు కూడా విడుదల చేసినట్లు ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం ఇప్పటికి మూడో క్వార్టర్ ఫీజులు కూడా విడుదల చేయాలి. ఇవి కాకుండా జగన్ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2,100 కోట్లు పెండింగ్ పెట్టారు. ఇది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా పరిణమించింది. అంతిమంగా ఇది విద్యార్థులపై ప్రభావం చూపిస్తోంది.
ఫీజులపై ఫైన్లు!
‘‘ప్రభుత్వం నుంచి ఫీజులు రాలేదు. కాబట్టి మీరే కట్టాలి. లేదంటే హాల్ టికెట్లు ఇవ్వం. పరీక్షలు రాయడం కుదరదు.’’ అంటూ ఈ నెల మొదట్లో మార్కాపురంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు అల్టిమేటం జారీ చేసింది. ఇక, కృష్ణా జిల్లాలోని మరో ప్రముఖ కాలేజీ పెండింగ్ ఫీజులపై రోజువారీ జరిమానాల విధానం అమలు చేస్తోంది. వెంటనే ఫీజు చెల్లించాలని, లేదంటే ప్రభుత్వం ఫీజులు విడుదల చేసేవరకు రోజుకు రూ.500 చొప్పున ఫైన్ కట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీలు విద్యార్థులపై ఇలానే ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. తొలుత ప్రభుత్వ షరతులకు అంగీకరించి, ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.