Tirumala: తిరుమలలో ప్రణయకలహోత్సవం
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:27 AM
తిరుమల క్షేత్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రణయ కలహోత్సవం కనువిందు చేసింది. స్వామి అమ్మవార్ల మధ్య కలహ శృంగార భరితమైన సన్నివేశాలు భక్తులకు ఆనందాన్ని పంచాయి.

తిరుమల, జనవరి15(ఆంధ్రజ్యోతి): తిరుమల క్షేత్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రణయ కలహోత్సవం కనువిందు చేసింది. స్వామి అమ్మవార్ల మధ్య కలహ శృంగార భరితమైన సన్నివేశాలు భక్తులకు ఆనందాన్ని పంచాయి. ఏటా వైకుంఠ ఏకాదశికి ఆరోరోజు, అధ్యయనోత్సవం 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామి పల్లకీ ఎక్కి మహప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరో పల్లకీపై అప్రదక్షిణంగా స్వామికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జీయంగార్లు పూల చెండ్లను స్వామిపై విసరడం.. వాటికి స్వామి బెదిరినట్టుగా వెనుకకు పారిపోయి మళ్లీ ముందుకు రావడం మూడుసార్లు చేశారు. తన తప్పేమీ లేదని అమ్మవార్లను స్వామివారు ప్రాధేయపడటం వంటి సన్నివేశాలను భక్తులు తన్మయత్వంతో తిలకించారు.
ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల, జనవరి15(ఆంధ్రజ్యోతి): తిరుమలలో బుధవారం శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి మధ్యాహ్నం మలయప్పస్వామి తిరుచ్చిలో ఊరేగింపుగా పాపవినాశనం మార్గంలోని పార్వేటమండపానికి వేంచేపు చేశారు. వెంట మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామినీ వేంచేపు చేశారు. పార్వేట ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన వేటకు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా నిలిచాయి. మలయప్పస్వామి తరుపున కొందరు అర్చకులు, అధికారులు ముందుకు కొంతదూరం పరుగెత్తి మూడుసార్లు ఈటెను విసరడం వంటి సన్నివేశాలను భక్తులు ఆసక్తికరంగా తిలకించారు.
3.36 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఐదురోజుల్లో 3,36,873 మంది స్వామి ని.. వైకుంఠ ద్వారాలను దర్శించుకున్నారు. రూ.16.75 కోట్ల హుండీ కానుకలు రాగా, 79,002 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, ధనుర్మాసం మంగళవారంతో ముగియడంతో బుధవారం ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది.