MLC Elections: రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:40 AM
‘ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి...
ప్రచార ఘట్టం పరిసమాప్తం
అమరావతి, ఏలూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఈ నెల 27న జరిగే రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 939 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీని కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 17 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. పోలింగ్ కోసం 8,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశాం’ అని వివేక్ యాదవ్ తెలిపారు.
కూటమి అభ్యర్థులకు మద్దతు.. పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్య ఓట్లు వేయాలి. ఇప్పటికే డీఎస్సీ ప్రక్రియ చేపట్టారు. రెండేళ్లుగా ఆగిపోయిన కానిస్టేబుళ్ల దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించారు. నిరుద్యోగులు, యువతకు కూటమి ప్రభుత్వంలోనే మేలు జరుగుతుంది’ అని సిద్దిక్ అన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారంతో ముగిసింది. ఎలాంటి కవ్వింపులు, దూషణలు, ఆరోపణాస్త్రాలు లేకుండా పట్టభద్రులు హుందాగా వ్యవహరించారు.