Polavaram Dam : ఐదేళ్ల తర్వాత కదలిక!
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:09 AM
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత కదలిక వచ్చింది.

నేడు పోలవరం డయాఫ్రమ్‌వాల్ పనులు పునఃప్రారంభం
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత కదలిక వచ్చింది. శనివారం ఉదయం 10.19 గంటలకు ప్రధాన డ్యామ్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఈ డ్యామ్ పనులు పునఃప్రారంభ సమయం కావడంతో.. అట్టహాసంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇతర ముఖ్యనేతలు, అధికారులు పాల్గొనాల్సి ఉన్నా, ఈ కార్యక్రమాలను నిరాడంబరంగా చేపట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేవలం పోలవరం చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి, సూపరింటెండింగ్ ఇంజనీరు రామచంద్రరావు, కాంట్రాక్టు సంస్థలు బావర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో పనులు ప్రారంభించనున్నారు. కాగా, శనివారం నుంచి డయాఫ్రమ్‌వాల్ టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడుతూ పనులు ప్రారంభమవుతాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ ఈ ముహూర్తం గురించి ముందే వెల్లడించింది!!,
ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో...
పాత డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2019-24 మధ్య కాలంలో పురోగతి మాటెలా ఉన్నా వాల్ దెబ్బతినడం, గైడ్‌బండ్ కుంగిపోవడం, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు సీపేజీ వంటి పెను సవాళ్లు ఎదురయ్యాయి. 2019 నాటికి 72 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టును జగన్ జమానాలో విధ్వంసానికి గురైంది. రూ.465 కోట్లతో ఎల్‌అండ్‌టీ, బావర్‌తో పూర్తయిన డయాఫ్రమ్‌వాల్ 2020లో దెబ్బతిన్నది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే డయాఫ్రమ్‌వాల్‌పై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను వేసి ఉంటే భారీ వరదలు వచ్చినా డయాఫ్రమ్‌వాల్‌తో సహా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు సీపేజీకి గురయ్యేవి కావని నిపుణులు పేర్కొంటున్నారు.
పోలవరం ప్రధాన డ్యామ్‌లో కీలక భూమిక వహించే డయాఫ్రమ్‌వాల్‌ను ప్రస్తుతం దెబ్బతిన్న వాల్‌కు సమాంతరంగా ఆరు మీటర్లకు ఎగువన 1396.6 మీటర్ల పొడవున రూ.980 కోట్లతో నిర్మిస్తారు. దీనికోసం కేంద్ర సాయిల్ అండ్ మినరల్ పరిశోధన సంస్థ (సీఎంఆర్‌ఎస్) ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగిస్తారు. డయాఫ్రమ్‌వాల్‌ను ఈ ఏడాది అంతానికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇదే సమయంలో 600 మీటర్ల మేర డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాక, మరోవైపు నుంచి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఒక సీజన్‌కు ముందే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని జల వనరుల శాఖ భావిస్తోంది.
జగన్‌కు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కులేదు: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టుతో సహా సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జలవనరుల ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబునాయుడి నివాసం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీటిపారుదల రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన జగన్‌కు గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత లేదన్నారు. మీడియా ముసుగులో తన రోత.. అవినీతి పత్రిక ద్వారా రోజూ అసత్య కథనాలతో ప్రజలను మభ్యపెట్టి మరోసారి రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ప్రణాళికలను జగన్ వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో 21.15 మీటర్ల కాంటూరులో తొలిదశ, 45.72 మీటర్ల కాంటూరులో రెండో దశ అంటూ విభజించి పోలవరం భవితను జగన్ ప్రశ్నార్థకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, రాష్ట్ర భవిత కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని రామానాయుడు ప్రశంసించారు.