Share News

Visakhapatnam : 8న విశాఖకు ప్రధాని మోదీ

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:28 AM

ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు గంటలపాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 Visakhapatnam : 8న విశాఖకు ప్రధాని మోదీ

  • సాయంత్రం 4.15కు రాక.. రోడ్‌ షో

  • పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

  • నగరంలో 3 గంటలు ఉండనున్న మోదీ

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు గంటలపాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నంలోని ఐఎన్‌ఎ్‌స డేగా (నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌)లో దిగుతారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. అనంతరం నేవీ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన 4.45 గంటలకు బయలుదేరి జాతీయ రహదారిలో తాటిచెట్లపాలెం జంక్షన్‌, సంపత్‌ వినాయక్‌ గుడి, దత్తా ఐలాండ్‌ మీదుగా ఏయూ ఎకనామిక్స్‌ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకూ కాన్వాయ్‌లో వస్తారు. అక్కడి నుంచి ఓపెన్‌టాప్‌ వాహనంపైకి ఎక్కి త్రీటౌన్‌ జంక్షన్‌ మీదుగా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఓపెన్‌టాప్‌ వాహనంపై ప్రధానితోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌, పలువురు కేంద్ర మంత్రులు ఉంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధాని సభా ప్రాంగణంలో ఉంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బహిరంగ సభలో తొలుత గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల తర్వాత ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 6.30 గంటలకు సభ ముగిసిన తర్వాత తిరిగి రోడ్డు మార్గాన ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఏడు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2025 | 04:28 AM