Amaravati Mega Launch: 58 వేల కోట్ల పనులకు శ్రీకారం
ABN , Publish Date - May 03 , 2025 | 04:33 AM
అమరావతిలో రూ.58 వేల కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ alone చేపట్టిన పనుల విలువే రూ.49 వేల కోట్లు
92 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
అమరావతిలో 49 వేల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులు
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): అమరావతి పునఃప్రారంభ వేదిక నుంచి రూ.58 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి.. రూ.54,028 కోట్లతో 83 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ.. రూ.4,050 కోట్లతో మరో 9 ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. వాటిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం-హెచ్‌వోడీ భవనాల నిర్మాణం, అమరావతి మౌలిక సదుపాయాలు, అమరావతి వరద నివారణ పనులు, అమరావతి భూసమీకరణ- మౌలిక సదుపాయాల కల్పన, గృహ సముదాయాల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, నాగాయలంకలో మిస్సైల్ పరీక్షా కేంద్రం, రైల్వే ప్రాజెక్టుల పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. వీటిలో కేంద్ర ప్రాజెక్టులు కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 74 ప్రాజెక్టుల విలువే రూ.49 వేల కోట్లుగా ఉంది.
1,459 కోట్లతో నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం
నాగాయలంకలో రూ.1,459 కోట్లతో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే విశాఖపట్నంలో రూ.100 కోట్లతో యూనిటీ-మాల్ నిర్మాణం, రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్-మల్లప్పగేట్ మధ్యలో ఆర్‌వోబీ, రూ.809 కోట్లతో గోరంట్ల-హిందూపూర్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, రూ.1,020 కోట్లతో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం, రూ.692 కోట్లతో నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దు సెక్షన్ వరకు రోడ్డు, రూ.279 కోట్లతో ముదిరెడ్డిపల్లి నుంచి కడప నెల్లూరు సరిహద్దు వరకు రోడ్డు, రూ.252 కోట్లతో రణస్థలం పట్టణంలో ఆరు లైన్ల రోడ్డు నిర్మాణాలకు మోదీ శంకుస్థాపనలు చేశారు. రూ.124 కోట్లతో జాతీయ రహదారి 44 వద్ద యర్రమంచి, గుడిపల్లి వద్ద ఆర్‌ఓబీ నిర్మాణంతోపాటు రూ.3,176 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా సీఎస్‌పురం నుంచి మాలకొండ వరకు రూ.277 కోట్లతో రోడ్డు నిర్మాణం, రూ.370 కోట్లతో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు, రూ.364 కోట్లతో సీతారామపురం నుంచి దుత్తలూరు వరకు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. రైల్వేశాఖకు సంబంధించి రూ.70 కోట్లతో ఎన్‌డబ్ల్యూబీహెచ్-బెజవాడలోని కొండపల్లి-విజయవాడ రైల్వేలైన్‌ను, రూ.184కోట్లతో చేపట్టిన బుగ్గనపల్లి-బి సిమెంట్‌నగర్-కేఈఎఫ్ పాణ్యం గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టుతోపాటు రూ.254 కోట్ల విలువైన మరో 3 ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ వాటిని జాతికి అంకితం చేశారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్