Share News

Anantapur: బియ్యం.. బొక్కేస్తున్నారు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:03 AM

పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని బొక్కేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో ఏకంగా బియ్యం సంచులే మాయమవుతున్నాయి. నేరుగా వ్యాపారులకు బియ్యం చేరుతోందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకు ఎఫ్‌పీ షాపుల్లో కనిపిస్తున్న బఫర్‌ స్టాకే నిదర్శనం. కొన్ని దుకాణాల్లో పదుల సంఖ్యలో బియ్యం బస్తాల కొరత కనిపిస్తోంది.

Anantapur: బియ్యం..  బొక్కేస్తున్నారు..

- పక్కదారి పడుతున్న పీడీఎస్‌ బియ్యం

- కొందరు డీలర్ల నుంచే నేరుగా వ్యాపారులకు..

- కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయం

- తేటతెల్లం చేస్తున్న బఫర్‌ లెక్కలు

- ఒక్కో షాపు నుంచి ప్రతినెలా 20 సంచుల వరకు..

- అనంత నగరం, పట్టణాల్లోనే అధికం

అనంతపురం: పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని బొక్కేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో ఏకంగా బియ్యం సంచులే మాయమవుతున్నాయి. నేరుగా వ్యాపారులకు బియ్యం చేరుతోందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకు ఎఫ్‌పీ షాపుల్లో కనిపిస్తున్న బఫర్‌ స్టాకే నిదర్శనం. కొన్ని దుకాణాల్లో పదుల సంఖ్యలో బియ్యం బస్తాల కొరత కనిపిస్తోంది. పేదల బియ్యం ద్వారా డబ్బు దోచుకునే వ్యవహారం గత వైసీపీ హయాంలో జోరుగా సాగింది. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు డీలర్లు కొనసాగిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ముడుపులతో చర్యలు తీసుకోలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రజలకు అందాల్సిన బియ్యం కొందరు అక్రమార్కుల పాలవుతోంది. ఈ దందా జిల్లా కేంద్రమైన అనంతపురంతోపాటు పట్టణాల్లోనే ఎక్కువగా సాగుతోంది. మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లోనూ పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది.


భారీ బఫర్‌...

రేషన్‌ షాపుల్లో కనిపిస్తున్న బఫర్‌ పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతోందో తేటతెల్లం చేస్తుంది. జిల్లావ్యాప్తంగా 1,645 రేషన్‌ దుకాణాలు ఉండగా... 6.25 లక్షల మంది కార్డుదారులున్నారు. ప్రతినెలా సుమారు 10వేల టన్నుల పీడీఎస్‌ బియ్యం సరఫరా అవుతుంది. అనంతపురం నగరంలో 137 ఎఫ్‌పీ షాపులున్నాయి. ప్రతి బస్తా లో 50 కిలోల పీడీఎస్‌ బి య్యం ఉంటుంది. వాటి లో 80 నుంచి 100 బస్తాలు బఫర్‌ ఉన్న ఎఫ్‌పీ షాపులు 25 వరకు ఉన్నట్లు సమాచారం. అంటే ఒక్కో దుకాణంలో 4వేల నుంచి 5వేల కిలోల బఫర్‌ ఉంది. మరికొన్ని ఎఫ్‌పీ షాపుల్లో 20 నుంచి 50 బస్తాల వరకు బఫర్‌ ఉన్నట్లు చూపుతున్నారు. ఇలా మొత్తం టన్నుల్లో బఫర్‌ చూపుతోంది. ఇక కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు పరిధిలో ఒక్కోచోట 500 క్వింటాళ్ల నుంచి 1000 క్వింటాళ్ల వరకు బఫర్‌ ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే వెసులుబాటును కొందరు డీలర్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. వారందరికీ ఇచ్చేశామని చెప్పి స్థానికులకు ఇవ్వకుండానే లేవని తిప్పి పంపుతున్నారు. పట్టణాలు, మండలకేంద్రాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా సాగుతోంది.


ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటే ఏం చేస్తున్నట్లు...?

డీలర్‌ అంటే అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో వచ్చిన వ్యక్తే. వైసీపీ హయాంలో కొందరు డీలర్లు పీడీఎస్‌ బియ్యం అమ్ముకుని బఫర్‌ వచ్చేలా చేశారు. కూటమి పాలనలోనూ కొందరు డీలర్లు అదే వైఖరి అవలంబించారు. కొందరు అమ్మకపోయినా గతంలో చేసిన వారి అక్రమ వ్యాపారంతో బఫర్‌ ప్రభావం కొనసాగుతోంది. బఫర్‌ ఎందుకు వస్తుంది, ఎవరెవరు వ్యాపారులకు పీడీఎస్‌ బియ్యం అమ్ముతున్నారనేది పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలుసు. ఆన్‌లైన్‌లో ఏ షాపులో ఎంత బియ్యం ఉంది..? ఎంత పంపిణీ చేస్తున్నారనేది తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీఎ్‌సడీటీలకు నెలవారీ ముడుపులు వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. మరికొందరు డీలర్లు అధికార పార్టీ నేతల పేరు చెప్పుకుని తమ వద్దకు ఎవరూ రాకుండా చూసుకుంటున్నారు.


మేమెట్టా బతకాలి..?

అనంతపురం పరిధిలో బఫర్‌ ఉన్న డీలర్లను తాజాగా అధికారులు పిలిపించుకున్నారు. ఈసారి బఫర్‌ లేకుండా బియ్యం సరఫరా చేయాలనే విషయంపై చర్చించారట. అదే క్రమంలో ఇకపై బియ్యం అమ్మడం లాంటివి జరిగితే ఏ6 కేసులు బనాయిస్తామని హెచ్చరించారట. ఈ క్రమంలో ఓ మహిళా డీలర్‌ 20 బస్తాలు అమ్మినట్లు తేలడంతో అధికారులు మరోసారి ఇలా జరగకూడదని చెప్పారట. దీంతో ఆ డీలర్‌ ‘మాకు వచ్చే 50కిలోల బస్తాలో 43 కిలోలు మాత్రమే బియ్యం ఉంటోంది. మరి మేమెలా బతకాలి. మేమూ డబ్బాలుంచుకోవాలి కదా..’ అని ప్రశ్నించడంతో సంబంధిత అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారట.


డీలర్లు పీడీఎస్‌ బియ్యం విక్రయిస్తే చర్యలు

అనంతపురం: జిల్లాలో కొన్ని రేషన్‌ షాపుల్లో షార్టేజ్‌(బఫర్‌)తక్కువగా ఉన్న విషయం వాస్తవమే. ఎవరైనా రేషన్‌ డీలర్లు పీడీఎస్‌ బియ్యం విక్రయిస్తే చర్యలు తప్పవు. కొందరు కేవలం థంబ్‌ వేసి బియ్యం తీసుకోవడం లేదనే విషయం మా దృష్టికి వచ్చింది. ఆ క్రమంలో తనిఖీలు చేసినప్పుడు చౌకధరల దుకాణంలో బియ్యం తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా విచారిస్తాం. గత కొన్ని నెలల్లో జిల్లా వ్యాప్తంగా 40కుపైగా కేసులు నమోదు చేశాం.

-వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ


ఈ వార్తలు కూడా చదవండి..

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 11:03 AM