LV Prasad Eye Institute: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:04 AM
ప్రపంచంలోనే.. కార్నియల్ న్యూరోటైజేషన్ శస్త్రచికిత్స నిర్వహించే అగ్రగామి కంటి చికిత్స కేంద్రాల్లో ఒకటిగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్(ఎల్వీపీఈఐ)కు గుర్తింపు దక్కింది.
కార్నియల్ న్యూరోటైజేషన్ శస్త్రచికిత్స నిర్వహించే కేంద్రాల్లో ఒకటి
2019 నుంచి ఇప్పటిదాకా ఆ తరహా ఆపరేషన్లు 40కి పైగా నిర్వహణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే.. కార్నియల్ న్యూరోటైజేషన్ శస్త్రచికిత్స నిర్వహించే అగ్రగామి కంటి చికిత్స కేంద్రాల్లో ఒకటిగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్(ఎల్వీపీఈఐ)కు గుర్తింపు దక్కింది. 2019 నుంచి ఇప్పటిదాకా ఎల్వీపీఈఐ ఈ తరహా శస్త్రచికిత్సలు 40కి పైగా చేసి అత్యుత్తమ ఫలితాలు నమోదుచేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గట్టిగా గాలి వీచి దుమ్ము లేస్తే.. అసంకల్పితన ప్రతీకారచర్యగా మనం కనురెప్పలు ఆడిస్తాం. కంట్లో ఏదైనా నలుసు పడితే.. వెంటనే కళ్లల్లో నీరు వచ్చి దాన్ని బయటకు నెట్టాలని ప్రయత్నిస్తుంది. కార్నియాకు సహజంగా ఉండే సెన్సేషన్ (స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రత వంటివాటిని గుర్తించే సామర్థ్యం) కారణంగా ఈ చర్యలన్నీ జరుగుతాయి.
పుట్టుకతో వచ్చే సమస్యల కారణంగాగానీ, న్యూరోసర్జరీ సమయంలో నాడులు దెబ్బతిన్నప్పుడుగానీ.. కార్నియాకు ఉండే ఆ సహజ సామర్థ్యం పోతుంది. అలాంటి సందర్భాల్లో.. నుదురు, కాలు వంటి ఇతర భాగాల నుంచి ఆరోగ్యవంతమైన సెన్సరీ నాడులను మైక్రో సర్జరీ ద్వారా కార్నియా సమీపంలో అతికిస్తారు. కొన్ని నెలల వ్యవధిలో అవి పెరిగి కార్నియా సెన్సేషన్‌ను పునరుద్ధరిస్తాయి. ఈ ప్రక్రియ కంటికి సాంత్వన కలిగించడమే కాక, దృష్టిని కాపాడడంలో కూడా సహాయపడుతుందని ఎల్వీపీఈఐ వైద్యులు తెలిపారు. ఈ ఆధునిక పరికరాలు చాలా కేంద్రాల్లో లభించవని.. పిల్లలు, పెద్దలకు వచ్చే న్యూరోట్రోఫిక్ కెరటిటిస్ చికిత్సలో ఏల్వీపీఈఐకి విశేష అనుభవం ఉందని వారు వివరించారు. ఇప్పటి వరకూ తాము నిర్వహించిన ఈ తరహా శస్త్రచికిత్సల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించారు.