Share News

Pawan Kalyan: శ్రామికులతోనే దేశ ప్రగతి

ABN , Publish Date - May 02 , 2025 | 04:34 AM

ఉపాధి కూలీలు ఇకపై “ఉపాధి శ్రామికులు”గా గుర్తింపు పొందనున్నారు. పల్లె అభివృద్ధి, ఉపాధి హామీ పథకం, బీమా రక్షణలతో కూటమి ప్రభుత్వం శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.

Pawan Kalyan: శ్రామికులతోనే దేశ ప్రగతి

అభివృద్ధికి ఉపాధి పథకం వెన్నెముక

ఉపాధి శ్రామికుల సంక్షేమానికి కట్టుబడతాం

  • ఉపాధి కూలీలు ఇకపై ఉపాధి శ్రామికులు

  • కండలు కరిగించేవారుంటేనే కట్టడాలు

  • ఉపాధి శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

  • శిథిల ఆర్థిక వ్యవస్థకు ఊపిరిగా పంచాయతీరాజ్‌ నిధులు

  • గత ఏడాది 10,669 కోట్లు ఖర్చు చేశాం

  • 24.23 కోట్ల పనిదినాలు కల్పించాం

  • ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్‌

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్‌ నిధులే ప్రాణ వాయువులా మారాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకలా నిలుస్తోందని చెప్పారు. గురువారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రామికులు లేకపోతే దేశ ప్రగతి ముందుకు సాగదని చెప్పారు. దేశ అభివృద్ధిలో భాగమవుతున్న ప్రతి శ్రామికుడికి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా నేటి నుంచి ఉపాధి హామీ పథకం కూలీలు అనే పేరును, ఉపాధి హామీ శ్రామికులుగా మారుస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రూ. 10,669 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.


అందులో రూ. 6,194 కోట్లు వేతనాలకే ఖర్చు చేశామని, రూ. 4,023 కోట్లు మెటీరియల్‌ కోసం ఖర్చు చేశామని పేర్కొన్నారు. 75.23 లక్షల కార్మికులకు సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 24.23 కోట్ల పనిదినాలు కల్పించామని, 5.10 లక్షల కుటుంబాలకు వందరోజుల పాటు పని కల్పించామని చెప్పారు. లంచాలకు తావు లేకుండా కట్టుదిట్టమెన ఏర్పాట్లు చేయడం వల్ల గతంలో రూ. 150లు మించని వేతనాలు ఇప్పుడు రూ. 307కి పెంచి ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లు ఎంత గొప్పో పనిచేసే ప్రతి శ్రామికుడు కూడా అంతే గొప్పే. మీకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది. పంచాయతీరాజ్‌శాఖ తీసుకోవడం వెనుక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం మినహా ఇతర కారణాలు లేవు. ఐదేళ్లలో మీకు ఎంత వరకు మద్దతుగా నిలవగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించినట్లు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణానికి అధికారులు పూనుకున్నాం.


easf.jpg

పల్లెపండుగలో 21 వేలకుపైగా గోకులాలు

పల్లె పండుగ ద్వారా ఇప్పటి వరకు రూ. 377.37 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 21,564 గోకులాలు పూర్తి చేశాం. ఉపాధి శ్రామికుల కష్టం ఫలితంగా గ్రామాల్లో రూ. 60.75 కోట్లు ఖర్చుతో 13,500 పశువుల తొట్టెలు పూర్తిచేశాం. అలాగే రూ. 317.91 కోట్లు ఖర్చుతో 63,582 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాం. ఒకే రోజు 1.21 కోట్ల మంది ఉపాధి శ్రామికులకు ప్రధానమంత్రి సురక్ష యోజన, జీవనజ్యోతి యోజన పథకాల కింద బీమా నమోదు చేశాం. పని ప్రదేశాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలి.శ్రామికులకు పూర్తివేతనం అందే లా అన్ని చర్యలు చేపట్టాం. ఉపాధి వేతనాలు పెరిగే లా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.

నీటి సంరక్షణకు చర్యలు

రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలంటే దాదాపు రూ. 87 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనాతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం. వాళ్లు పరిశీలించి ఇప్పటి వరకు రూ. 29 వేల కోట్లకు అనుమతులిచ్చారు. పూర్తి స్థాయిలో పనులు చేయాలంటే ఇంకో రూ. 57 వేల కోట్లు అవసరం. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వ పాలకులు.. సారాయి సాణువుల మీద కూడగట్టుబెట్టుకున్నారు. మద్యం తయారుచేసి, అమ్మి దాదాపు రూ. 3,200 కోట్లు దోచుకున్నారని ఇప్పటివరకు తెలిసింది’’ అని పవన్‌ చెప్పారు. అంతకు ముందు పవన్‌కల్యాణ్‌ ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను ఆలకించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ, ఉపాధి పథకం డైరెక్టర్‌ షణ్ముక్‌ కుమార్‌, సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, ఏసీ శివప్రసాద్‌, జేడీ సునీత తదితరులు పాల్గొన్నారు.


1.21 కోట్ల ఉపాధి శ్రామికులకు బీమా

ఉపాధి శ్రామికుల కుటుంబాలకు భరోసా కల్పించాలనే పవన్‌ కల్యాణ్‌ సూచనలతో కమిషనర్‌ కృష్ణతేజ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో శ్రామికులందరినీ నమోదు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద మే ఒకటో తేదీ ఒక్క రోజే 94 లక్షల మంది నమోదయ్యారని, అలాగే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద 27 లక్షల మంది నమోదు అయ్యారని మొత్తంగా 1.21 కోట్ల మంది ఉపాధి శ్రామికులకు బీమా సౌకర్యం దక్కిందని అధికారులు తెలిపారు.

పీ4 ద్వారా ఆదుకోండి

ఉపాధి శ్రామికులు పలువురు పవన్‌కల్యాణ్‌తో ముచ్చటించారు. తాను, తన భర్త దివ్యాంగులమేనని, తమను పీ4 ద్వారా ఆదుకోవాలని పల్నాడు జిల్లాకు చెందిన చెంచు భూలక్ష్మి కోరారు. ఖుషి సినిమా పోస్టర్‌ తమ దేవుడి ఇంట్లో ఉంటుందని తెలిపారు. కుప్పం నుంచి వచ్చిన రామప్ప అనే ఉపాధి శ్రామికుడు మాట్లాడుతూ.. తాను ఉపాధి పథకం ద్వారా పూలతోటలు పెంచి రూ. 30 వేలు ఆదాయం గడించానని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మల్లేశ్‌ మాట్లాడుతూ వ్యవసాయ పనులకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై పవన్‌ మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్‌ ఉందన్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన శ్రామికులు చెప్పిన వివరాలను పవన్‌ సావధానంగా విన్నారు. అనంతరం ఆయన ఉపాధి శ్రామికులతో ఫొటోలు దిగారు.


‘‘గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు. నాకు పల్లెలు అంటే ఇష్టం. గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షిస్తాను. శ్రమ విలువ నాకు తెలుసు కాబట్టి ఉపాధి శ్రామికుల విలువ తెలుసు. కండలు కరిగించేవారు లేకపోతే కట్టడాలు ఉండవు. హరితహారాలు ఉండవు. అందుకే శ్రమపడేవారిని దేశాన్ని, రాష్ట్రాన్ని నిర్మించే శ్రామికులుగా గుర్తించాలి. కార్మిక దినోత్సవాన మిమ్మల్ని ఉపాధి కూలీలుగా కాకుండా దేశ నిర్మాణంలో చమటోడ్చే శ్రామికులుగా గుర్తిస్తున్నాం. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం.’’

- పవన్‌ కల్యాణ్‌


ఇవి కూడా చదవండి..

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి

Updated Date - May 02 , 2025 | 04:34 AM