Political Strategy: రాజ్యసభకు నాగబాబు!
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:18 AM
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు కె.నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు.

మండలికి కాకుండా ఢిల్లీ పంపాలని జనసేన ప్రతిపాదన
ఆమోదించిన సీఎం చంద్రబాబు
సాయిరెడ్డి వైదొలగిన స్థానంలో ఎంపిక?
అక్కడ బీజేపీ పోటీచేస్తుందని ప్రచారం
ఒకవేళ నాగబాబుకే ఇస్తే బీజేపీకి ఎమ్మెల్సీ!
అటు టీడీపీలో భారీగా ఆశావహులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు కె.నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీంతో ఆయనకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని నిన్నటివరకు అంతా భావించారు. అనూహ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన జనసేన నుంచే రావడంతో టీడీపీ అధినేతఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వాటిలో ఒక స్థానం నాగబాబుకు ఖాయమని తొలుత అనుకున్నారు. కానీ ఆయన రాజ్యసభ వైపు మొగ్గు చూపడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాగా.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేయగా ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నాగబాబును నిలపాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని నిలుపుతుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆ సీటును నాగబాబుకు ఇచ్చేపక్షంలో.. ఆయనకు కేటాయిద్దామనుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అడిగే అవకాశాలు ఉన్నాయి.
టీడీపీలో పోటాపోటీ
ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న టీడీపీలోని ఆశావహులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసి వెళ్తున్నారు. మంగళవారం లోకేశ్‌ను కలిసినవారిలో మాజీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ప్రస్తుతం రిటైరవుతున్న ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్‌బాబు ఉన్నారు.
వీరితోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎం సైఫుల్లా తనయుడు జియావుల్లా కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మైనారిటీలకు అవకాశం ఇస్తే తన పేరు పరిశీలించాలని ఆయన కోరుతున్నారు. ఇదే కోటాలో విశాఖకు చెందిన మహమ్మద్ నజీర్ కూడా ఆశిస్తున్నారు. బుద్ధా వెంకన్న ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితోపాటు వెళ్లి చంద్రబాబును కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా గళం వినిపించానని, తనపై 37 కేసులు పెట్టారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దాడికి వచ్చినప్పుడు గట్టిగా ప్రతిఘటించడం... స్థానిక ఎన్నికల సందర్భంగా పల్నాడులో తనపై జరిగిన దాడి... ఇతర సందర్భాల్లో పార్టీ తరఫున చేసిన పోరాటాల గురించి గుర్తుచేశారు. బీసీ (గవర) కోటాలో తనకు ఎమ్మెల్సీ ఇస్తే ఉమ్మడి కృష్ణాతోపాటు విశాఖ జిల్లాలోని నియోజకవర్గాలపైనా ప్రభావం ఉంటుందని తెలియజేశారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు కోరుతున్నారు. బీసీ కోటాలోనే బీద రవిచంద్ర కూడా ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి విదితమే. ఆ సమయంలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనా రేసులో ఉన్నారు. జనసేనాని కోసం తన సీటు త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వడం దాదాపు ఖాయమని చెబుతున్నారు.