Share News

Vijayawada Airport : ఎయిర్‌పోర్టులు కళకళ

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:06 AM

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్వవైభవం వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మిలియన్‌ మార్క్‌ (ఏడాదికి)ను అందుకున్న ఈ విమానాశ్రయం..

Vijayawada Airport : ఎయిర్‌పోర్టులు కళకళ

  • 6 నెలలుగా పెరుగుతున్న ప్రయాణికులు

  • విజయవాడ విమానాశ్రయానికి పూర్వవైభవం

  • మిలియన్‌ మార్క్‌ దాటి.. రికార్డు దిశగా

  • గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఈ ఘనత

  • వైసీపీ పాలనలో ఏ ఏడాదీ దాటని వైనం

  • వైజాగ్‌, తిరుపతి, రాజమండ్రిలోనూ వృద్ధి

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ ఊపందుకుంటోంది. ఆరు నెలలుగా వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్వవైభవం వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మిలియన్‌ మార్క్‌ (ఏడాదికి)ను అందుకున్న ఈ విమానాశ్రయం.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైభవం కోల్పోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ మిలియన్‌ మార్క్‌ను అందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు చివరకు 9,99,555 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. జనవరిలో మొదటి రోజునే మిలియన్‌ మార్క్‌ను చేరుకుంది. మరో రెండు నెలలు ఉండటంతో ఇంకా 3 లక్షల మంది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తోంది. జూలై నెల నుంచి విమాన ప్రయాణాలు పెరిగాయని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి తెలిపారు. విమానాల సంఖ్య పెరగటంతో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు నడిచే విమానాలలో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. ప్రయాణికుల వృద్ధిలో విజయవాడ విమానాశ్రయం దేశంలో 35వ ర్యాంకు సాధించింది. డిసెంబరులోనే 47ు మేర ట్రాఫిక్‌ పెరిగింది. గతఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు చూస్తే ప్రయాణికుల వృద్ధిలో 23.9 శాతం పెరుగుదల ఉంది. ఇతర ఎయిర్‌పోర్టుల విషయానికి వస్తే.. జాతీయ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి విశాఖ విమానాశ్రయం 26, తిరుపతి 45, రాజమండ్రి 53 ర్యాంకులను సాధించాయి. విశాఖపట్నం నుంచి 2,75,694 మంది ప్రయాణికులు, తిరుపతి విమానాశ్రయం నుంచి 1,02,739 మంది, రాజమండ్రి నుంచి 51,332 మంది ప్రయాణికుల రాకపోకలతో వృద్ధి నమోదైంది.

Updated Date - Jan 31 , 2025 | 04:06 AM