AP Panchayat Department: పంచాయతీరాజ్ ప్రక్షాళనలో తొలి అడుగు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:00 AM
పంచాయతీరాజ్ శాఖలో ప్రక్షాళనకు శంకుస్థాపనగా ఉద్యోగుల కేడర్‌లో సమానతకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీడీఓల నుంచి సీఈఓల వరకు క్రమబద్ధమైన పదోన్నతులు, శిక్షణ విధానం అమలులోకి వస్తున్నాయి

ఉద్యోగుల సర్వీసు విషయాల్లో పలు మార్పులు
ఒకే కేడర్‌గా ఎంపీడీఓ, డీఎల్‌పీఓలు
ఎంపీడీఓల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు చెక్
కేడర్‌లు నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌శాఖ ప్రక్షాళన కోసం ఆ శాఖ చేసిన మొదటి ప్రతిపాదనపై రాజముద్ర పడింది. పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మొదటగా ఉద్యోగుల కేడర్ విషయంలో తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. అతిముఖ్యమైన సర్వీసు విషయాలపై ముందు దృష్టిసారించారు. మండల పరిషత్ డెవల్‌పమెంట్ ఆఫీసర్(ఎంపీడీఓ), డివిజనల్ పంచాయతీ అధికారులు(డీఎల్‌పీఓ)లను ఒకే కేడర్‌గా నిర్ధారించారు. పదోన్నతితో వారు డివిజనల్ అభివృద్ధి అధికారులు (డీఎల్‌డీఓ)లు అవుతారు. అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్‌లో ఉన్న జిల్లా పంచాయతీ అధికారులు(డీపీఓ)లకు డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్(డిప్యూటీ డైరెక్టర్ హోదా) కల్పించారు. ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్(ఈటీసీ) ప్రిన్సిపాళ్లకు డిప్యూటీ కమిషనర్ (అడిషనల్ డైరెక్టర్) హోదా కల్పించారు. డీడీఓలు, డిప్యూటీ సీఈఓలు, డీపీఓలను ఒకే కేడర్ కిందకు చేర్చారు. వారు పదోన్నతి పొంది జెడ్పీ సీఈఓలు అవుతారు. డీడీఓ/డీపీఓ/డిప్యూటీ సీఈఓలు మూడోవంతు మందిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో తీసుకోనున్నారు. 50 శాతం జెడ్పీ సీఈఓ పోస్టులను ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆయా పోస్టులకు సంబంధించి ఐఏఎస్ అధికారులు లేకపోతే ఆ ఖాళీలను పంచాయతీరాజ్‌శాఖలో ఫీడర్ కేటగిరినుంచి భర్తీ చేయాలని నిర్ణయించారు. లేకపోతే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై నియమించుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్గత కేడర్ బదిలీ సమయంలో కచ్చితంగా శిక్షణ అందివ్వాలని నిర్ణయించారు. డీఎల్‌డీఓలను ఇకపై గ్రూప్-1లో మూడోవంతు పోస్టులకు డైరెక్ట్ నియామకం ద్వారా చేపడతారు. అలాగే డీపీఓ పోస్టులకు ఇకపై నేరుగా నియామకం చేపట్టరు. ప్రస్తుతమున్న డీఎల్‌పీఓలు, డీపీఓలకు జాబితా పూర్తయ్యే వరకు ఒక నిర్ధిష్ఠ నిష్పత్తిలో పదోన్నతి కల్పిస్తారు.
శిక్షణ పొందిన వారికే పదోన్నతులు
తాజా సంస్కరణల్లో భాగంగా ఎంపీడీఓలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కాకుండా పదోన్నతులతో భర్తీ చేయనున్నారు. ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ, సూపరింటెండెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు వేల మంది ఉన్నందున వారికి పదోన్నతుల అవకాశాలు దక్కేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ కేడర్‌ను డిప్యూటీ ఎంపీడీఓలుగా పరిగణిస్తారు. ఎంపీడీఓ, డీడీఓ, డీపీఓ, సీఈఓ తదితర పోస్టులకు కచ్చితంగా శిక్షణ అందించి నియమిస్తారు. శిక్షణ పొందిన వారికే పదోన్నతులు లభిస్తాయి. నేరుగా నియామకం పొందిన అధికారులు పదోన్నతి పొందిన తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి చేశారు. పదోన్నతి పొందిన ప్రతి అధికారి నెల రోజులు శిక్షణ తీసుకోవాలి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన డీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు ఏడాది పాటు పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణపొందాల్సి ఉంటుంది. ఇంటర్ కేడర్ బదిలీల్లో భాగంగా ఒక ఏడాది పాటు ఆన్‌జాబ్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.
Read Latest AP News And Telugu News