Back from Pakistan: పాక్ నుంచి తిరిగొచ్చిన బెజవాడ కోడలు
ABN , Publish Date - May 02 , 2025 | 05:14 AM
పాక్‌కు వెళ్లిన విజయవాడ కోడలు మోనికా రజని, కుమార్తెతో కలిసి అటారీ సరిహద్దు గుండా తిరిగి భారత్ చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ వచ్చిన 70కి పైగా పాక్ మహిళలలో ఆమె ఒకరు
అటారీ సరిహద్దుకు చేరుకున్న మోనికా రజని
పుట్టినింటి వారిని చూడటానికి పాకిస్థాన్‌కు
పహల్గాం ఉగ్రదాడితో తిరిగి భారత్‌కు రాక
భర్త పవన్ రబ్బర్ ఇండస్ర్టీస్ అధినేత
గురునానక్ కాలనీలో కుటుంబం నివాసం
విజయవాడ(వన్‌టౌన్), మే 1(ఆంధ్రజ్యోతి): బెజవాడ యువకుడిని వివాహం చేసుకున్న పాకిస్థాన్ యువతి మోనికా రజని(35) తిరిగి భారత్ చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన పుట్టినింటి వారిని చూడటానికి ఆమె పాక్‌కు వెళ్లారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా పాక్ ప్రభుత్వం సైతం భారతీయులను తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మోనికా రజని వద్ద ఎన్‌వోఆర్‌ఐ సర్టిఫికెట్, దీర్ఘకాలిక వీసా ఉండటంతో తన కుమార్తె సైమరా(5)తో పాటు పాకిస్థాన్ నుంచి బయలుదేరి గురువారం అటారీ సరిహద్దుకు చేరుకున్నారు. మోనికా రజని తొమ్మిదేళ్ల క్రితం విజయవాడకు చెందిన పవన్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుటుంబం స్థానిక గురునానక్ కాలనీలో నివసిస్తోంది. భర్త ఆటోనగర్‌లో రబ్బర్ ఇండస్ర్టీ నిర్వహిస్తుంటారు. మోనికా రజని భారత్‌కు తిరిగి వస్తుండటంతో ఆమె భర్త, కుటుంబీకులు అంతా అమృత్‌సర్ వెళ్లారు. అటారీ సరిహద్దు వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు (ఐసీపీ) వద్దకు చేరుకున్నానని, ఇక్కడ కస్టమ్స్, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం దాదాపు 3గంటలు పట్టిందని తెలిపారు. విజయవాడకు వెళ్లేముందు తాను, కుటుంబ సభ్యులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. తాను కూడా పాకిస్థాన్‌లో హిందూ కుటుంబంలోనే జన్మించానని, తమది పెద్దలు కుదిర్చిన వివాహమని వివరించారు. వారి కుటుంబం విజయవాడ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
భారత యువతికి.. పాక్ పౌరసత్వం
కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని సనత్‌నగర్‌కు చెందిన మహిళ పాకిస్థ్థాన్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అక్కడే కొంతకాలం ఉన్న తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని తిరిగి తన స్వస్థలానికి తిరిగొచ్చారు. అనంతరం వేరే వ్యక్తిని వివాహం చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన ఆమె దీర్ఘకాలిక వీసాపై ఇక్కడ ఉంటున్నారు. ఆమె ఇక్కడ ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసు వర్గాలు నిర్ధారించాయి. ఆమెకు సంబంధించిన పత్రాలు అన్నీ సమర్పించాలని పోలీసులు సూచించారు.
70 మందికి పైగా పాక్ మహిళలు భారత్‌కు
భారతీయులను వివాహం చేసుకున్న 70మందికి పైగా పాకిస్థానీ మహిళలు అటారీ సరిహద్దు మీదుగా భారత్‌కు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థానీయులకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసింది. తమ తల్లిదండ్రులను కలుసుకోవడానికి పాక్ వెళ్లిన మహిళలను సరైన పత్రాలు ఉన్నప్పటికీ అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు భారత్‌కు తిరిగి రాకుండా అడ్డుకున్నారు. అయితే చర్చల అనంతరం పాకిస్థాన్ పాస్‌పోర్టుతో పాటు ఎన్‌వోఆర్‌ఐ (నో అబ్జెక్షన్ టు రిటర్న్ టు ఇండియా) సర్టిఫికెట్, దీర్ఘకాలిక వీసా (ఎల్‌టీవీ) ఉండి, భారతీయులను వివాహం చేసుకున్నవారికి తిరిగి వెళ్లడానికి మినహాయింపు ఇచ్చారు. దీంతో 70మందికి పైగా ఎన్‌వోఆర్‌ఐ వీసాదారులతో సహా మొత్తం 240 మంది గురువారం భారత్‌లోకి ప్రవేశించారు. మరోవైపు భారత్ నుంచి 140 మంది అటారీ సరిహద్దు మీదుగా పాక్‌కు వెళ్లిపోయారు. కాగా, స్వల్పకాలిక పర్యటనల కోసం పాకిస్థాన్‌కు వెళ్లేవారికి విదేశీ వ్యవహారాల శాఖ ఎన్‌వోఆర్‌ఐ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇవి ఉన్నవారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా భారత్‌కు తిరిగి రావడానికి అనుమతిస్తారు.