Minister Lokesh school Visit: వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం.. చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి లోకేష్
ABN , Publish Date - Jul 07 , 2025 | 10:55 AM
Minister Lokesh school Visit: వీఆర్ హై స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం క్లాస్ రూంలను సందర్శించి డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు మంత్రి లోకేష్. ప్రతీ క్లాస్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో యువనేతతో ఫోటోలు దిగేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు.
నెల్లూరు, జులై 7: అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన వీఆర్ హై స్కూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లాస్ రూంలను సందర్శించి డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు మంత్రి. ప్రతీ క్లాస్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో యువనేతతో ఫోటోలు దిగేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు. దీంతో దాదాపు అర్ధగంట పాటు విద్యార్థులతో సరదాగా గడిపారు విద్యాశాఖా మంత్రి. ఆపై స్కూల్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు.
అనంతరం పీ4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు షరణి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజులను సత్కరించారు. అలాగే క్రీడా మైదానాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్.. క్రికెట్, వాలీబాల్ ఆడి చిన్నారుల్లో జోష్ నింపారు. స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి లోకేష్‌కు మంత్రులు పొంగూరు నారాయణ, పొంగూరు షరణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కలెక్టర్ ఆనంద్ ఘనస్వాగతం పలికారు. కాగా.. గత ప్రభుత్వం నిర్వాకంతో ఐదేళ్లుగా మూతబడిన వీఆర్ హైస్కూల్‌ను ఇక్కడే చదువుకున్న మంత్రి నారాయణ చొరవతో దాదాపు రూ.15 కోట్లతో పాఠశాలకు పునర్వైభవం తీసుకొచ్చారు. అంతేకాకుండా 1050 మంది నిరుపేద విద్యార్థులను ఈ స్కూల్‌లో చేర్చుకున్నారు. వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకొన్న ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ దత్తత తీసుకొన్న మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు కూడా మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.
వీఆర్ హైస్కూల్ తరహాలోనే..: మంత్రి నారాయణ

పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..‘1850లో వీఆర్ విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. నేను వీఆర్ విద్యాసంస్థల్లోనే హైస్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను. రెండేళ్లు అధ్యాపకుడిగా కూడా పనిచేశాను. అప్పట్లో 6800 మంది విద్యార్థులు చదువుకునేవారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులపాలు చేసింది. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. అందుకు వీఆర్ స్కూల్ నిదర్శనం. వీఆర్ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాం. పేద, నిరుపేల పిల్లలకు చదువుకునే అవకాశం ఇస్తున్నాం. మంత్రి లోకేష్‌ను అడిగిన వెంటనే అనుమతులు, సిబ్బందిని ఇచ్చారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారంతా ఒక్కొక్కరూ ఒక్కో స్కూల్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని స్కూళ్లను వీఆర్ స్కూల్ తరహాలో అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అత్యద్భుతంగా వీఆర్ హై స్కూల్: కోటంరెడ్డి

వీఆర్ విద్యా సంస్థలు తమకు మరుపురాని మధురస్మృతులని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇటీవల వీఆర్ హైస్కూల్ చాలా ఘోరంగా ఉండేదని... ఇప్పుడు అత్యద్భుతంగా రూపుదిద్దుకుందన్నారు. ఇది చాలా సంతోషమని తెలిపారు. ఇదే తరహాలో వీఆర్ కాలేజీని కూడా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..
Read latest AP News And Telugu News