Share News

Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్

ABN , Publish Date - May 26 , 2025 | 03:06 PM

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్
Kakani Govardhan Reddy

నెల్లూరు, మే 26: క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Former Minister Kakani Govardhan Reddy) వెంకటగిరి కోర్టు (Venkatagiri Court) రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులో నిన్న (ఆదివారం) కాకాణిని బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి.. ఈరోజు (సోమవారం) నెల్లూరు జిల్లా వెంకటగిరికి తీసుకొచ్చారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వెంకటగిరి కోర్టులో హాజరుపర్చారు. ముందుగా వాదనలు విన్న జడ్జి.. లంచ్ తర్వాత కాకాణికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. మాజీ మంత్రిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాకాణిని వెంకటగిరి నుంచి నెల్లూరు తీసుకువచ్చి.. జిల్లా సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు.


క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుళ్ల పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసుకు సంబంధించి కాకాణి ఏ4గా ఉన్నారు. కాకాణిని కోర్టుకు తీసుకువస్తున్నందుకు ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. దీన్ని ఉల్లంఘిస్తూ వైసీపీకి చెందిన నేతలు కోర్టు ప్రాంగణం వద్ద గుమిగూడారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు రెండు నెలలుగా మాజీ మంత్రి తప్పించుకుని తిరుగుతున్నారు. తాను ఎక్కడికీ పోలేదని.. నెల్లూరులోనే ఉంటానని, ఈ కేసులకు భయపడను అంటూ మొదట్లో చెప్పుకొచ్చారు మాజీ మంత్రి. కానీ ఆ తరువాత అకస్మాత్తుగా కాకాణి అదృశ్యమయ్యారు. ఆపై రెండు నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు సార్లు పోలీసులు కాకాణికి నోటీసులు జారీ చేశారు.


మూడు సార్లు నోటీసులు ఇచ్చిన సమయంలో కాకాణి లేకపోవడంతో రెండు సార్లు ఇంటి గోడకు నోటీసులు అతికించగా.. మూడో సారి బంధువులకు అందజేశారు. అయినప్పటికీ కాకాణి పోలీసుల విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బెంగుళూరు శివారులోని ఓ రిసార్ట్‌లో కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆయనను విచారించగా.. పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. తనకేమీ తెలియదని, ఈ కేసుతో సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ఆపై మాజీ మంత్రిని వెంకటగిరి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. మరోవైపు కాకాణిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో కోర్టులో పిటిషన్ వేసి విచారణ నిమిత్తం కాకాణిని కస్టడీకి కోరే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

మీకు వ్యక్తులు చనిపోవడమే కావాలా.. పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 05:01 PM