Ongole : ఆవుల ఆకలి కేకలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:27 AM
రామతీర్థం వద్ద పశుగణాభివృద్ధి క్షేత్రాన్ని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఒంగోలు జాతికి శాపంగా వైసీపీ పాలన
ప్రకాశం జిల్లా చదలవాడ పశుక్షేత్రంపై తీవ్ర నిర్లక్ష్యం
పోషకాహారానికి నిధులు ఇవ్వని వైనం
డొక్కలు ఎండి ఉసూరుమంటున్న పశువులు
కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తే అత్యున్నత జాతి రక్షణ
(ఒంగోలు, ఆంధ్రజ్యోతి)
ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి కోసం తొలుత ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని రామతీర్థం వద్ద పశుగణాభివృద్ధి క్షేత్రాన్ని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. గెలాక్సీ గ్రానైట్ తవ్వకాలతో 1994-99 మధ్య అక్కడి పశుక్షేత్రం నెల్లూరు జిల్లా చింతలదీవికి తరలించే ప్రయత్నాలు జరిగాయి. దీన్ని అప్పటి జిల్లా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఒంగోలు సమీపంలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద 200 ఎకరాల దేవదాయ భూమిని కొనుగోలు చేసి 2000లో పశుక్షేత్రం ఏర్పాటు చేశారు. 18 ఎకరాల్లో షెడ్లు, నీటికుంటలు, వర్షాధార యూనిట్లు ఇతర భవనాలు నిర్మాణం చేయగా మిగతాది పశుగ్రాసానికి వాడుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఒంగోలు జాతి పశుసంపదకు శాపంగా మారింది. పశుక్షేత్రంలో సరైన పోషకాహారం లేక ఆవులు, కోడెలు ఆకలికేకలు పెడుతున్నాయి. కాస్తంత వయసు పైబడిన పశువులు అయితే ఎముకల గూళ్లుగా మారిపోయాయి. తక్షణం కూటమి ప్రభుత్వం పశుక్షేత్రంపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
వేలం ద్వారా అమ్మకాలు
తొలినాళ్లలో ఇక్కడ పుట్టిన దూడలను ప్రతి ఏటా వేలం ద్వారా అమ్మేవారు. 2009-14 మధ్య అధికారుల నిర్లక్ష్యం, గుండ్లకమ్మ లిఫ్టు మరమ్మతులకు గురికావడం, ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నదిలో నీటి ప్రవాహం తగ్గి గడ్డి దొరక్కపోవడం, వర్షాలు లేక పశుగ్రాస పంటలు పండక పోవడం.. వంటి ప్రతికూల పరిస్థితులతో పశువులు గడ్డుకాలం ఎదుర్కొన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం పశుక్షేత్రంపై దృష్టిసారించింది. ఆనాటి కలెక్టర్ సుజాత శర్మ ఆ ప్రాంతం లో నీటి కుంటలు, పొలంలోకి వెళ్లే రోడ్లు ఇతర పనులు చేయించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద అప్పటి ప్రభుత్వం రూ.6 కోట్లు విడుదల చేయగా పశుక్షేత్రంలో షెడ్లు, రహదారులు ఇతర భవనాల నిర్మించారు.
గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం
వైసీపీ అధికారంలోకి వచ్చాక పశుక్షేత్రాన్ని గాలికి వదిలేసింది. ఏడాదికి కనీసం రూ.50 లక్షలు ఇచ్చిన పాపాన పోలేదు. తొలి ఏడాది రూ.31 లక్షలు ఇచ్చి తర్వాత ఏటా రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. దీంతో సమీకృత దాణా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పశుక్షేత్రంలో దూడల కొనుగోలుకు డిమాండ్ తగ్గింది. అమ్ముడైన వాటికి కూడా సరైన ధర రాలేదు. గతంలో రూ.70 వేల నుంచి రూ.75 వేలు పలికిన కోడె దూడలు ఇప్పుడు అందులో సగం కూడా పలకడం లేదు. పెయ్య దూడలది అదే పరిస్థితి. దీంతో క్షేత్రంలో పశువుల సంఖ్య పెరిగిపోయింది. 200 పశువుల పోషణకు సౌకర్యాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 345 ఉన్నాయి. పాలిచ్చే ఆవులు 77, ఏడాది నిండిన కోడెలు 57 ఉన్నాయి. ఇక ప్రతి పది పశువులకు సిబ్బంది ఒకరు ఉండాలి. ఆ ప్రకారం 35 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 11 మంది దీర్ఘకాలంగా టైం స్కేలుతో, 18 మంది ఆప్కాస్ ద్వారా తాత్కాలికంగా పనిచేసేవారు ఉన్నారు. ప్రస్తుతం పశుక్షేత్రంలో ఏడాదికి పశువుల అమ్మకం ద్వారా రూ. 10 లక్షలు, పాల విక్రయాల ద్వారా రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలు రాబడి ఉంటోంది. అయితే ప్రస్తుతం పశుక్షేత్రం అభివృద్ధి, మేతకు ఏడాదికి రూ. కోటి అవసరం అవుతోంది.
84 కోట్లతో ప్రతిపాదనలు
ఉన్న వనరులతో వీలైనంత మెరుగ్గా పశుక్షేత్రం ఉండేలా ప్రయత్నిస్తున్నాం. పశుపోషణలో సమీకృత దాణా అత్యంత ప్రధానమైనది. కనీసం రూ. 50 లక్షలు ఏడాదికి అవసరమవుతాయి. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. మొత్తం పశుక్షేత్రం అభివృద్ధి, సౌకర్యాల పెంపునకు రూ. 84 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించాం. ఆవుల ఉత్పత్తిని మరింత పెంచి జిల్లాలో పాడిపై ఆధారపడిన కుటుంబాల్లోని స్వయం సహాయక మహిళలకు ఇస్తాం. తద్వారా వారికి ఉపాధి, పాల ఉత్పత్తి పెంపునకు అవకాశం ఉంటుంది.
- బి. రవి, పశుసంవర్థకశాఖ డీడీ, క్షేత్ర పర్యవేక్షకులు