Nara Lokesh : తొలి ప్రాధాన్య ఓట్లతోనే కూటమి అభ్యర్థులు గెలవాలి
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:05 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి’ అని మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు లోకేశ్ దిశానిర్దేశం
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి’ అని మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ‘ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండటంతో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రతి ఓటరునూ ఓటు అభ్యర్థించాలి. ఎన్నికల ముందు రోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో మరుసటి రోజు జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యే లు బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూంను ఏర్పాటు చేయాలి. కూటమి నాయకులంతా కలిసికట్టుగా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి’ అని లోకేశ్ కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి, ప్రాంతీయ సమన్వయకర్తలు సుజయకృష్ణ రంగారావు, ఎంవీ సత్యనారాయణరాజు, దామచర్ల సత్య, మందలపు రవి తదితరులు పాల్గొన్నారు.