Nara Lokesh: మచిలీపట్నంలో అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభ
ABN , Publish Date - Dec 16 , 2025 | 08:28 PM
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విలువలు, తపనతో రాజకీయాలు చేశారని చెప్పారు. అవినీతి మచ్చలేని ఏకైక నేతగా..
మచిలీపట్నం, కృష్ణాజిల్లా డిసెంబర్ 16: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభలో మంత్రి నారా లోకేష్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కొనియాడారు. వాజ్‌పేయి అంటే, తనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆయన విలువలు, తపనతో రాజకీయాలు చేశారని చెప్పారు. అవినీతి మచ్చలేని ఏకైక నేతగా వాజ్‌పేయిని అభివర్ణించిన లోకేష్, పదవుల కంటే విలువలు ముఖ్యమని ఆయన నమ్మారని, ప్రధాని పదవిని సైతం వదులుకున్నారని తెలిపారు.
దేశ భద్రత కోసం అణు పరీక్షలు చేపట్టి, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పారని నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక సంస్కరణలతో దేశ దశ-దిశ మార్చారని, హిందీలో మాట్లాడి అందరినీ మెప్పించారని అన్నారు. తాను ఆయన్ను నేరుగా కలవలేదని, కానీ చంద్రబాబు-వాజ్‌పేయి మధ్య తండ్రి-కొడుకు అనుబంధం ఉందని చెప్పారు.
జాతీయ రహదారుల నిర్మాణం, టెలికం విప్లవాత్మక మార్పులు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అందించిన సహకారం కోసం తెలుగు జాతి ఆయనకు రుణపడి ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేపట్టారని, కూటమి ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపారని లోకేష్ అన్నారు.
వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ అద్భుత పాలన అందిస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయని, మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని చెప్పారు. మోదీ-చంద్రబాబు జోడీతో ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతుందని హామీ ఇచ్చారు.ప్రజలు 164 సీట్లు ఇచ్చి పట్టం కట్టారని, మా బాధ్యతను నెరవేరుస్తామని, అభివృద్ధి-సంక్షేమం సమానంగా తీసుకెళ్తామని తెలిపారు.
నేడు నైతిక విలువలు ముఖ్యమని, పాఠశాలల్లో విద్యార్థులకు చెబుతున్నామని, రాజకీయాల్లో కూడా విలువలు పాటించాలని సూచించారు. వాజ్‌పేయి గొప్పతనం అందరూ తెలుసుకోవాలని, మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విగ్రహం పెట్టాలని కోరానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మాధవ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని నారా లోకేష్ తెలిపారు.
Also Read:
అంతర్జాతీయ వేదికపై తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి..
కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు