Municipal Elections: స్థానిక శంఖారావం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:14 AM
రాష్ట్రంలో స్థానిక శంఖారావం మోగనుంది. వచ్చే ఏడాది మార్చి17కి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్నందున ముందుగా ఎన్నికలకు సిద్దంకావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ...
మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కండి
3 నెలల ముందుగా ఎన్నికల కసరత్తు
జనవరి నాటికి ఎన్నికలు పూర్తిచేయాలి
జనవరి నుంచి పంచాయతీలు, జూలై నుంచి ఎంపీటీసీ/జడ్పీటీసీలకూ ఎన్నికల సన్నాహాలు
మున్సిపల్ శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక శంఖారావం మోగనుంది. వచ్చే ఏడాది మార్చి17కి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్నందున ముందుగా ఎన్నికలకు సిద్దంకావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ... పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శికి బుధవారం లేఖ రాశారు. ఎన్నికల సన్నాహాల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ముందుగా పంచాయతీల అప్‌గ్రేడేషన్, సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17 నాటికి ముగియనుందన్నారు. రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ 2021లో జరిగాయి. ఈ 13 స్థానికసంస్థలకు వచ్చే ఏడాది నవంబర్ 21కు గడువు ముగుస్తుందని తెలిపారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2017 ఆగస్టు-సెప్టెంబరులో ఎన్నికలు జరిగాయని, 2022 సెప్టెంబరుకు వాటి గడువు ముగిసిందని పేర్కొన్నారు. మిగిలిన శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లితో పాటు 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955 ప్రకారం సాధారణ స్థానికసంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే మూడు నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రీ ఎలక్షన్ షెడ్యూల్..
డీలిమిటేషన్, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబరు 15లోగా పూర్తి చేసుకోవాలి. వార్డులవారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి. అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోపు ఈ సన్నాహాలు పూర్తిచేయాలి. నవంబరు 1 నుంచి 15దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలి. నవంబరు 16 నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్దం చేయాలి. నవంబరు 30 లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలి. రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబరు 15 లోగా పూర్తి కావాలి. డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతోను, సీనియర్ అధికారులతోను సమావేశం నిర్వహించాలి. జనవరి 2026 లోపు ఎన్నికలు నిర్వహించాలి. అదే విధంగా 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ/జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్నీ తెలిపారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News