Ginning Mill Issues in AP: జిన్నర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:55 AM
రాష్ట్ర పరిధిలోని పత్తి మిల్లుల యజమానుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని సీసీఐ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు..
సీసీఐకి వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశం
రాష్ట్ర పరిధిలో నిబంధనల సడలింపునకు గ్రీన్‌సిగ్నల్
గుంటూరు సిటీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిధిలోని పత్తి మిల్లుల యజమానుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని సీసీఐ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు టెండర్ ప్రక్రియను జిన్నర్లు బహిష్కరించిన నేపథ్యంలో సచివాలయంలో బుధవారం ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్న ఈ సమావేశంలో టెండర్లు దాఖలకు అడ్డంకిగా మారిన నిబంధనలపై చర్చ జరిగింది. టెండర్లు ప్రక్రియను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో యజమానులు మంత్రికి వివరించారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4, ఎల్ 5గా మిల్లులను విభజించటం, దూది నాణ్యత పెంపు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. మిల్లుల యజమానులు చెబుతున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిబంధనల సడలింపు వ్యవహారం తన పరిధిలో లేదని, సీఎండీ దృష్టికి తీసుకు వెళ్తానని సీసీఐ జీఎం రాజేంద్రషా మంత్రికి తెలిపారు. సీఎండీని పిలిపించి జిన్నర్లతో ఈ నెల 5వ తేదీ లోపు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన మంత్రికి ఏపీ కాటన్ టీఎంసీ కన్సార్టియం అధ్యక్షుడు ఇక్కుర్తి శివప్రసాద్, జాయింట్ సెక్రటరీ మన్నవ హరినాథ్‌బాబు, ఎల్ సీటీసీ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News