Krishna District : సాగునీటి సమస్యలని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:39 PM
కృష్ణా డెల్టా తూర్పు కెనాల్ కింద ఉన్న గుడివాడ, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈస్టర్న్ కెనాల్ కు 10,400 క్యూసెక్కుల నీరు..
గుడ్లవల్లేరు (కృష్ణా జిల్లా) ఆగష్టు 5 : కృష్ణా డెల్టా తూర్పు కెనాల్ కింద ఉన్న గుడివాడ, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో సాగు నీటి సమస్యలని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈస్టర్న్ కెనాల్ కు 10,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా, దిగువకు సాగునీరు అందని పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. సిఈ దగ్గర నుండి కింద స్థాయి ఉద్యోగులు వరకూ అందరూ కెనాల్స్ పై తిరుగుతూ సాగు నీరు పారుదల పర్యవేక్షించాలని ఆదేశించారు.
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా చూడాలని మంత్రి ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒక ఏడాది వరదలు వస్తే, రెండు, మూడు సంవత్సరాలకు సరిపడేలా వాటర్ మేనేజ్మెంట్ ద్వారా నీటి నిల్వలు చేయాలని చంద్రబాబు ఆదేశించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు 1350 కోట్లతో పట్టి సీమ నిర్మిస్తే, అది పట్టి సీమ కాదు.. వొట్టి సీమ అని వైఎస్ జగన్ విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంలో మంత్రి గుర్తు చేశారు.
గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి 50 వేల కోట్ల ఆదాయం సృష్టించామని, ఇది చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమని, వైఎస్ జగన్‌కు ఇవన్నీ ఏం తెలుసునని మంత్రి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన సాగునీటి సంఘాలకు చంద్రబాబు పునరుజ్జీవం పోయడంతో ఇరిగేషన్ వ్యవస్థ ఇప్పుడు మళ్లీ గాడిన పడుతుందని నిమ్మల చెప్పారు. కృష్ణా జిల్లా పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఇందులో భాగంగా గుడ్లవల్లేరు లాకులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
గ్రానైట్ క్వారీని పరిశీలించిన ఒడిశా బృందం