Nara Lokesh: నమో దెబ్బకు.. పాకిస్తాన్ తోకముడవటం ఖాయం..

ABN , First Publish Date - 2025-05-02T16:22:29+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు.. పాకిస్థాన్‌ తోకముడవటం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులర్పించారు.

Nara Lokesh: నమో దెబ్బకు.. పాకిస్తాన్ తోకముడవటం ఖాయం..
Minister Nara Lokesh

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు.. పాకిస్థాన్‌ తోకముడవటం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులర్పించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. పాకిస్తాన్ గీత దాటి, అమాయకులని చంపి చాలా పెద్ద తప్పు చేసిందన్నారు. ఒక్క పాకిస్తాన్ కాదు.. వంద పాకిస్తాన్‌లు వచ్చినా కూడా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేవని చెప్పారు. వంద పాకిస్తాన్‌లకు సమాధానం చెప్పగలిగే ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉందని, ఆ మిస్సైల్ నరేంద్ర మోదీ అని కొనియాడారు. సింహం ముందర ఆటలు ఆడకూడదు.. ఆడితే మన సింహం నమో కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్‌లోనే పాకిస్తాన్ మిస్సింగ్ కావడం ఖాయమన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో పని చేసే వారు కొంతమంది రాజీనామాలు చేశారని, మరికొంతమంది సెలవులో వెళ్లిపోయారని చెప్పారు. అది నరేంద్ర మోదీ పవర్ అంటూ కొనియాడారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీకి మద్దతు ఇస్తోందన్నారు.


కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకుందని.. ఇది నిర్ణయం కాదని, ఇది ఒక సంచలనమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ అన్నా... అమరావతి అన్నా ఎంతో ప్రేమ అని అన్నారు. అందుకే ప్రధాని ఢిల్లీలో ఎంతో బిజీగా ఉన్నా కూడా కార్యక్రమానికి హాజరయ్యారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభాత్వాన్ని 94 సీట్లతో ప్రజలు గెలిపించారని, అందుకే ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలనూ తీరుస్తున్నారని చెప్పారు. ఇటీవలే విశాఖపట్నంలో రైల్వే జోన్, ఎన్‌టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌కు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అలాగే విశాఖ ఉక్క ఫ్యాక్టరీని కూడా కాపాడారని తెలిపారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాకుండా.. పనులు కూడా ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.


వైసీపీ పాలనలో వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. జై అమరావతి అన్నందుకు గతంలో బయట తిరగలేని పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2025-05-02T16:52:44+05:30 IST