Share News

Minister Kolusu Parthasarathi: ప్రజల్లో సంతృప్తి పెరిగింది

ABN , Publish Date - May 06 , 2025 | 05:23 AM

వైసీపీ ప్రభుత్వం నాయకుడి సంతృప్తి కోసం పనిచేస్తే, కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి కోసం పనిచేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగినట్లు సర్వే నివేదికలు పేర్కొన్నాయి.

 Minister Kolusu Parthasarathi: ప్రజల్లో సంతృప్తి పెరిగింది

  • పథకాలపై సానుకూలంగా ఉన్నారు

  • మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): తమ నాయకుడి సంతృప్తి కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే, ప్రజల సంతృప్తే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా పథకాలు అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు అంశాల్లో సీఎం సమీక్షల వివరాలను వివరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్న తీరుపై సీఎం ఆరా తీశారన్నారు. ఐవీఆర్‌ఎస్‌, ఇతర సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే ప్రజల సంతృప్త స్థాయి కొన్ని నెలలుగా పెరుగుతోందనే విషయం స్పష్టమైందన్నారు. ఇంటివద్దే పింఛను ఇవ్వడంపై 87.8 శాతం మంది, అధికారుల ప్రవర్తన బాగుందని 85 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రెవెన్యూ, హౌసింగ్‌లపై లబ్ధిదారులు సంతృప్తికరంగా ఉన్నట్లు ఐవీఆర్‌ఎస్‌ నివేదికలు తెలుపుతున్నాయన్నారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందని మంత్రి చెప్పారు. దానిలో భాగంగా ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు-5.00 లక్షలు అనే కార్యాచరణను రూపొందించిందన్నారు. నైపుణ్య అంచనాకు స్కిల్‌ టెస్టులు పెడతామన్నారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌, వాట్సాప్‌ గవర్నెన్స్‌లపై కూడా సీఎం సమీక్షించారని మంత్రి చెప్పారు. పిడుగుల వల్ల గొర్రెలకాపరులు మరణిస్తున్న నేపథ్యంలో దగ్గర్లోని సచివాలయ అధికారులు గొర్రెల కాపరులను అప్రమత్తం చేసేందుకు ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాన్ని రూపొందించాలని కూడా సీఎం చెప్పారన్నారు.

Updated Date - May 06 , 2025 | 05:24 AM