Minister Swami : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించలేదు
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:57 AM
రాష్ట్రంలో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించలేదు. అర్హత ఉన్న ఒక్కరి పెన్షన్‌ని కూడా ప్రభుత్వం తీసేయడం లేదు.

అర్హతున్న ఏ ఒక్కరి పింఛనూ తీసేయలేదు
ప్రజలను రెచ్చగొట్టడమే నీలి మీడియా లక్ష్యం: మంత్రి స్వామి
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించలేదు. అర్హత ఉన్న ఒక్కరి పెన్షన్‌ని కూడా ప్రభుత్వం తీసేయడం లేదు. నీలి మీడియా పనికట్టుకొని విషప్రచారం చేస్తున్నది’ అని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కులం, మతం, పార్టీ అన్నది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే పరిశీలించాలని మాత్రమే ఆదేశాలు జారీ చేశాం. కానీ సచివాలయ ఉద్యోగులను, అర్హుల పింఛన్‌లను తొలగిస్తున్నట్లు జగన్ పత్రిక రోత రాతలు రాస్తున్నది. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు’ అని స్వామి హితవు పలికారు.