Share News

Milind Parande : స్వాతంత్య్రం దేశానికే.. ఆలయాలకు రాలేదు

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:23 AM

తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు- ప్రదర్శన (ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో- ఐటీసీఎక్స్‌-2025) ..

Milind Parande : స్వాతంత్య్రం దేశానికే..  ఆలయాలకు రాలేదు

  • దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి

  • ఐటీసీఎక్స్‌ సమావేశంలో మిలింద్‌ పరాండే డిమాండ్‌

  • ఆలయాల విముక్తికిప్రణాళిక ప్రకటించిన వీహెచ్‌పీ నేత

  • తమిళనాడులో అధికారంలోకి వస్తే దేవదాయ చట్టం రద్దు

  • తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ అన్నామలై ప్రకటన

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందే గానీ హిందూ దేవాలయాలకు ఇప్పటికీ నిజంగా స్వాతంత్య్రం రాలేదని విశ్వ హిందూ పరిషత్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు- ప్రదర్శన (ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో- ఐటీసీఎక్స్‌-2025) రెండోరోజు సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పరాండే ప్రసంగిస్తూ హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయడానికి కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దక్షిణాదితో పాటు యావత్‌ దేశంలో లక్షలాది హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయని, మరే మతమూ ఇలాంటి వివక్షను ఎదుర్కోవడం లేదని మండిపడ్డారు. ఇది హిందూ సమాజానికి అగౌరవమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దేవాలయాల సంపదను, నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను చూసిన బ్రిటిషర్లు వాటిని అధికార కేంద్రాలుగా గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఇప్పటికీ అదే కొనసాగుతోందని, దీనికి ముగింపు పలకాలని పరాండే పిలుపునిచ్చారు. ‘మన దేవాలయాలకు కేంద్రీకృత నియంత్రణ అవసరం లేదు. దేశ చట్టాలకు లోబడి ఆలయాలు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాం. అన్ని ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి. దీనికోసం భక్తులు, కార్యకర్తలు, సాధువులు, ఆచార్యులు, సుప్రీంకోర్టు లాయర్లు, విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులతో ఒక మేధోమండలిని, దానిపై నియంత్రణకు రాజ్య ధార్మిక పరిషత్‌లో ఉన్నత వ్యవస్థను ఏర్పాటుచేయాలి’ అని ఆయన సూచించారు.


మత పెద్దలు, విశ్రాంత న్యాయమూర్తులు, సివిల్‌ సర్వెంట్లు, వ్యాపార, పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, ఎస్సీ, ఎస్టీ తెగలు, మహిళలు, తత్త్వశాస్త్ర, సంప్రదాయ, ధార్మిక పద్ధతులు, ఆగమాలు తదితర రంగాల్లోని పండితులతో పాటు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ప్రధానన్యాయమూర్తి ధార్మిక పరిషత్‌లో సభ్యులుగా ఉంటారని వివరించారు. పారదర్శకత కోసం ప్రతి రెండేళ్లకు కమిటీలో మూడింట ఒక వంతు పదవీ విరమణ చేస్తారని వెల్లడించారు. ఇలాంటి విధానం ద్వారా హిందువుల డబ్బు హిందూ మతం కోసం, హిందూ సమాజంలోని పేదల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంటుందని, ఆలయ ఆస్తుల సంరక్షణకు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. అర్చకులు, సేవకుల హక్కులను పరిరక్షణకూ వీలవుతుందని చెప్పారు. హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి నినాదంతో జనవరి 5న విజయవాడలో భారీ సభ జరిపామని, ఏపీలోని హిందూ ఆలయాలను హిందూ సమాజానికి అప్పగించాలని కోరుతూ, అందుకు తగిన ప్రణాళికతో కూడిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబుకు అందజేశామని వివరించారు. రానున్న కాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించి, ఆయా ముఖ్యమంత్రులకు ఈ ప్రతిపాదన సమర్పిస్తామని మిలింద్‌ పరాండే ప్రకటించారు.


అవన్నీ అక్రమ చట్టాలు: అన్నామలై

తమిళనాడులో అధికారంలోకి వస్తే హిందూ దేవాలయాలను చెరబట్టిన హిందూ రెలిజియస్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ) చట్టాన్ని రద్దు చేస్తామని తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె.అన్నామలై ప్రకటించారు. ఐటీసీఎక్స్‌ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆలయ ఆర్థిక వ్యవస్థ, స్వయంప్రతిపత్తి అంశంపై ప్రసంగించారు. దేవదాయ చట్టాలు అక్రమ చట్టాలని అభివర్ణించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి దేవదాయ చట్టాలను రద్దు చేసి, ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాల్పిందేనని డిమాండ్‌ చేశారు. ఆర్థిక శక్తికి, పుష్టికి దేవాలయాలు అత్యంత కీలకమన్నారు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు 2.5 లక్షల కోట్లని, అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థల కంటే ఇది పెద్దదని చెప్పారు. హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌లు(హెచ్‌ఆర్‌సీఈ) దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని వివరించారు. తమిళనాడులో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు వేంకటేశ్వరస్వామి అవకాశం కల్పిస్తే... చట్టవిరుద్ధమైన విధానాలన్నింటినీ తొలగించి, మొత్తం 44,121 దేవాలయాలను హెచ్‌ఆర్‌సీఈ బారినుంచి విడిపిస్తామని అన్నామలై ప్రకటించారు. దేవాలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడు ఆలయాలను చూసి తెలుసుకోవచ్చని అన్నారు. చారిత్రక ఆలయాలను మరమ్మతుల పేరుతో దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారని, వీటిలో 600కు పైగా ఆలయాలు వెయ్యేళ్ల క్రితం నిర్మించినవని తెలిపారు. దేవుడికి భక్తులు దూరమయ్యేలా ద్రవిడ పార్టీలు చేస్తున్నాయని అన్నామలై ఆరోపించారు.


ఆలయ విద్యపై చర్చ

టెంపుల్‌ ఎక్స్‌పో రెండోరోజు కార్యక్రమాల్లో ఆలయ విద్యపై ప్యానెల్‌ చర్చ జరిగింది. షిర్డీ సాయిబాబా ట్రస్టు మాజీ చైర్మన్‌ గిరేష్‌ కులకర్ణి, వెలింగ్‌కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉదయ్‌ సలుంఖే, ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ ఎక్స్‌పో ప్రతినిధి డాక్టర్‌ సురేష్‌ చర్చలో పాల్గొన్నారు. టెంపుల్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకుడు గిరేష్‌ వాసుదేవ్‌ కులకర్ణి అధ్యక్షత వహించారు. అలాగే శ్రీవారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. పలు ఆలయాలు, వివిధ అంశాలకు చెందిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో టీటీడీ అదనపు జేఈవో వెంకయ్య చౌదరి, కోవిలూరు మఠాధిపతి నారాయణ దేశిక స్వామిగళ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 04:23 AM