Migrant Workers : పిల్లల ఆలనాపాలనపై ఆందోళన
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:24 AM
ఉపాధి కోసం కుటుంబాలను వదిలి ఎడాది దేశాలకు వలస వచ్చిన ప్రవాసీయులను హడలెత్తిస్తున్నాయి. ఏ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారు కుటుంబాన్ని, సొంతూరిని వదిలి ఎడారి దేశాలకు వచ్చారో..

ఎవరి కోసం విదేశానికి వచ్చారో వారి కోసం ఇంటికి తిరుగుముఖం
ఉద్యోగాలు వదిలి స్వదేశానికి ప్రవాసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన గడ్డం శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉంటుండగా అతని కుమారుడు, మైనర్ బాలుడు సంజయ్ స్వగ్రామంలో ఇంటి వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల కోసం శ్రీనివాస్ తన భార్య శ్రీలక్ష్మి పేరిట ఓ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశారు. సంజయ్ ఆ వాహనాన్ని నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వాహన యజమాని అయిన సంజయ్ తల్లి శ్రీలక్ష్మిని కూడా పోలీసులు అరెస్టు చేయగా ఆమె బెయిల్‌పై విడుదలైంది.
ఏపీకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను బంధువుల వద్ద వదిలి ఉపాధి నిమిత్తం కువైత్ రాగా.. వారి సమీప బంధువు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రవాసీయుడు స్వదేశానికి వచ్చి ఆ బంధువును హతమార్చాడు.
ఉపాధి కోసం కుటుంబాలను వదిలి ఎడాది దేశాలకు వలస వచ్చిన ప్రవాసీయులను హడలెత్తిస్తున్నాయి. ఏ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారు కుటుంబాన్ని, సొంతూరిని వదిలి ఎడారి దేశాలకు వచ్చారో.. తిరిగి అదే కుటుంబం, పిల్లల రక్షణ కోసం అన్ని వదిలి ఇంటికి వెళ్లేలా చేస్తున్నాయి. స్వదేశంలో భార్యబిడ్డలను వదిలి ఎడారి దేశాలకు వచ్చి రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇంటి పెద్ద దిక్కు గల్ఫ్‌లో ఉండడం.. స్వగ్రామంలోని ఇంట్లో ఉన్న పిల్లలకు తల్లి మాత్రమే దిక్కుగా ఉంటుండడంతో ప్రవాసీయులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి.
కుటుంబానికి సరైన మార్గదర్శకత్వం లేక గల్ఫ్ వలసల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితి గాడి తప్పుతుంది. దీంతో గల్ఫ్‌లో చేస్తున్న ఉద్యోగాలను వదిలి రాలేక ఇటు మాతృభూమిలో కుటుంబాలను సరిగ్గా చూసుకోలేక ప్రవాసీయులు సతమతమవుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుటుంబంలో జరిగిన ఘటన కుటుంబాలను వదిలి విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసీయులందరికీ వణుకు పుట్టించింది.
ఈ ఘటన కంటే ముందు రాజన్న సిరిసిల్ల జిల్లాకే చెందిన ఇద్దరు ప్రవాసీయులకు చెందిన పిల్లలు ప్రమాదాల్లో మరణించారు. ఆ ప్రవాసీయులు తమ పిల్లలను కడసారి కూడా చూసుకోలేకపోయారు. ఎవరి కోసం ఎడారికి వచ్చామో వారే చనిపోయాకా ఈ ఉద్యోగం, డబ్బు ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తూ వారిద్దరూ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక, పిల్లలను బంధువుల వద్ద ఉంచి ఉపాధి కోసం విదేశాలకు వచ్చిన ప్రవాసీయుల పరిస్థితి మరోలా ఉంటుంది. అయిన వారే అత్యాచారాలకు పాల్పడడం, హింసించడంతో పిల్లల జీవితాలు నాశనం అవుతుండగా, తల్లిదండ్రులు ఆవేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి కువైత్ నుంచి ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలానికి వెళ్లి తన సమీప బంధువును హతమార్చాడు. అంతకముందు ఒమాన్‌లో నివాసముండే ఓ ప్రవాసీ కుమార్తె(మైనర్ బాలిక).. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో అత్యాచారానికి గురైంది. ఇలాంటి ఘటనలు ప్రవాసీలను హడలెత్తిస్తున్నాయి. దీంతో పిల్లలు ఎదుగుతున్న కొద్ది డబ్బు అవసరం ఉన్నప్పటికీ వారి ఆలనాపాలన కోసం చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు.
- ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి