Melioidosis Fever Case: ఆ వ్యాధి ఇంకెక్కడా రాకూడదు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:16 AM
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తురకపాలెం వంటి జ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది...
కేస్ స్టడీగా తురకపాలెం జ్వరాలు
రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు
గ్రామంలో మట్టి నమూనాల సేకరణ
గాలి నాణ్యత పరీక్షలు చేసిన నిపుణులు
తురకపాలానికి నేడు ఐసీఎంఆర్ బృందం
గ్రామంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పల్లె నిద్ర
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తురకపాలెం వంటి జ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గుంటూరు జిల్లాలోని ఆ గ్రామంలో ప్రబలిన జ్వరాలను, నమోదైన మరణాలను కేస్ స్టడీగా తీసుకొని మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తురకపాలెంలో నమోదైన మెలియోయిడోసిస్ జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే మరణాల శాతం అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారని తెలిసింది. ఈ తరహా జ్వరాల నిర్ధారణ, చికిత్సలకు ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలు (ఎస్‌వోపీ) రూపొందించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాల్లో బ్లడ్ కల్చర్ పరీక్షలు ఇకపై 24 గంటలూ నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
నమూనాలు సేకరించిన నిపుణుల బృందం
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) సూచించిన హైదరాబాదులోని లాబొరేటరీ బృందం సోమవారం తురకపాలెంలోని ఎనిమిది ప్రాంతాల్లో పరీక్షల కోసం మట్టి నమూనాలు ేసకరించారు. గనులు, భూగర్భ శాఖ, ఏపీ పీసీబీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గాలి నాణ్యత పరీక్షల్లో అన్ని స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని ఫలితాలు వచ్చాయి. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు, డ్రైన్లు, మంచి నీటి వాల్వ్ పిట్స్ శుభ్రపర్చి, ఫాగింగ్, ఎబెట్ స్ర్పే చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గ్రామంలో 4 వేల లీటర్ల సామర్థ్యం గల 20 ట్యాంకర్లు, 12 వేల లీటర్ల సామర్థ్యం గల 3 ట్యాంకర్లు ద్వారా మంచి నీటిని సరఫరా చేశారు. సోమవారం గ్రామంలో 3,829 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించారు.
ఇద్దరికి మెలియోయిడోసిస్
ఢిల్లీ నుంచి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిపుణుల బృందం మంగళవారం తురకపాలానికి రానుంది. గ్రామాన్ని సందర్శించి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తుంది. ప్రస్తుతం ఏడుగురు తురకపాలెం వాసులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని, వీరిలో పి.ఎలీషా, పి.నరసింహారావుకు మెలియోయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయిందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెలిపారు. వీరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వివరించారు. మరోపక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులతో పాటు మంగళగిరి ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వైద్యులు, ఆస్టర్ రమేశ్ ఆసుపత్రి వైద్యనిపుణులు గ్రామంలో ఓపీ వైద్య సేవలు అందించారు. పది బృందాలు ఇంటింటి సర్వే చేస్తూ గత మూడు రోజుల్లో 1,501 రక్త నమూనాలను ేసకరించాయి. వాటిని ల్యాబ్‌లకు పంపారు. ఈ కార్యక్రమాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డాక్టర్ ఎ. సిరి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది.
ఎమ్యెల్యే సహపంక్తి భోజనం
గ్రామస్తులకు భరోసా కల్పిస్తూ ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు సోమవారం గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. అదేవిధంగా గ్రామస్తుల్లో ధైర్యం నింపేందుకు పల్లె నిద్ర కార్యక్రమం కింద తురకపాలెంలోనే రాత్రి నిద్రించారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News