Share News

Man Attacks In-Laws: అత్తమామలపై మచ్చుకత్తితో దాడి

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:10 AM

మద్యం మత్తు.. భార్యపై అనుమానం అతడిలో విచక్షణ కోల్పోయేలా చేసింది. కట్టుకున్న భార్యతోపాటు అత్తామామలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Man Attacks In-Laws: అత్తమామలపై మచ్చుకత్తితో దాడి

  • అక్కడికక్కడే ఇద్దరు వృద్ధుల మృత్యువాత

  • భార్యపైనా కత్తి వేటు.. తీవ్రగాయాలు.. పరారీలో భర్త

దుత్తలూరు (ఉదయగిరి), జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తు.. భార్యపై అనుమానం అతడిలో విచక్షణ కోల్పోయేలా చేసింది. కట్టుకున్న భార్యతోపాటు అత్తామామలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అత్తామామలు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకుంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కమ్మవారిపాళెం సమీపాన ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాలనీకి చెందిన ఏలూరి వెంగయ్య, వెంకాయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. మద్యానికి బానిసైన వెంగయ్య కొన్ని నెలలుగా భార్యను అనుమానిస్తూ తరచూ వివాదానికి దిగేవాడు.


ఈ తరుణంలో ఆదివారం కాలనీలో కొందరితో కలిసి వెంకాయమ్మ వింజమూరు మండలం గుండెమడగల చెరువులో చేపల కోసం వెళ్లింది. చేపలు విక్రయించగా వచ్చిన రూ.300 నగదుతో రాత్రి 7 గంటలకు ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన వెంకాయమ్మతో ఎవరికి చెప్పి చేపలకు వెళ్లావు.. మందు తాగొచ్చి నీ అంతు చూస్తానంటూ వెంగయ్య తీవ్రంగా హెచ్చరించాడు. భయబ్రాంతులకు గురైన ఆమె.. పెద్దకుమార్తెను వెంటబెట్టుకుని సమీపంలోని తన తల్లిదండ్రుల ఇంటికెళ్లింది. 11 గంటల ప్రాంతంలో పూటుగా మద్యం సేవించి వచ్చినవెంగయ్య మచ్చు కత్తి చేత పట్టుకుని.. అత్తగారింటికి వెళ్లి.. గొడవకు దిగాడు. అత్తామామలు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అత్త చలంచర్ల జయమ్మ (59), మామ కల్లయ్య (64)లపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమై వారిరువురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ వెంటనే భార్యపై కూడా దాడి చేయడంతో ఆమె కొంతదూరం వెళ్లి పడిపోయింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా వారిపై కూడా వెంగయ్య కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా వారు ఎదురు తిరగడంతో పరారయ్యాడు. వెంగయ్య కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించినట్లు ఉదయగిరి ఎస్‌ఐలు ఆదిలక్ష్మి, రఘునాథ్‌ తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 05:11 AM