Minister Nara Lokesh : బ్రాండ్ ఏపీ పునరుద్ధరణే లక్ష్యంగా!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:38 AM
ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ పునరుద్ధరణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవవనరుల శాఖల మంత్రి లోకేశ్ దావోస్ పర్యటన సాగింది.

30 మంది పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీలు
దావోస్‌లో 8 రౌండ్‌టేబుల్ సమావేశాలు
9 మంది అంతర్జాతీయ నిపుణులతో చర్చలు
ముగిసిన లోకేశ్ దావోస్ పర్యటన
ఆ ఐదేళ్లూ పునరావృతం కావు!
ఏఐ, క్లీన్ ఎనర్జీ మా ప్రాధాన్యాలు
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్ర అంతరంగాన్ని ఆవిష్కరించిన యువనేత
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ పునరుద్ధరణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవవనరుల శాఖల మంత్రి లోకేశ్ దావోస్ పర్యటన సాగింది. గడచిన ఐదేళ్ల నాటి పరిస్థితులు పునరావృతం కావని హామీ ఇస్తూనే.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడంలో లోకేశ్ సఫలీకృతలయ్యారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రకటించిన పెట్టుబడిదారుల సానుకూల విధానాలు, అమలు చేస్తున్న ప్రోత్సహకాలు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, కృత్రిమ మేధ (ఏఐ), క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టంగా వివరించారు. దావోస్ పర్యటన పూర్తిచేసుకున్న లోకేశ్ శుక్రవారం రాష్ట్రానికి తిరుగుపయనమయ్యారు. నాలుగు రోజులపాటు అక్కడ జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో 30 మందికిపైగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన ముఖాముఖి భేటీ అయ్యారు. తొలి రోజున స్విట్జర్లాండ్ పారిశ్రామికవేత్తలు, తెలుగు ఇండస్ట్రియలిస్టుల సమావేశాల్లో పాల్గొని.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వివిధ అంశాలపై జరిగిన 8 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. ఆయా రంగాల్లో ప్రభుత్వ విధానాలను విశదీకరించారు. వివిధ రంగాలకు చెందిన 9 మంది అంతర్జాతీయ నిపుణులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. తమ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్థిపథంలో పయనిస్తుందో ప్రత్యక్షంగా వివరించారు.
చంద్రబాబుతోపాటు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, మిట్టల్ గ్రూప్ అధినేత లక్ష్మీమిట్టల్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను కూడా లోకేశ్ కలిశారు. పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దృక్కోణాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏపీ విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు, ఔషధ, ఆరోగ్య, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు.
‘మంగళగిరి’ కానుకలు
దావోస్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భాల్లోనూ లోకేశ్ తన నియోజకవర్గమైన మంగళగిరిపై తన ప్రేమను.. మంగళగిరి చేనేతలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. బిల్‌గేట్స్, లక్ష్మీ మిట్టల్‌ను మంగళగిరి శాలువాలతోనే సీఎం చేతుల మీదుగా సత్కరించారు. తాను కలిసిన పారిశ్రామికవేత్తలను కూడా వాటితోనే సన్మానించారు. దావోస్ వెళ్లే ముందు మంగళగిరి చేనేత శాలువాలను ప్రత్యేకంగా ఆర్డర్ చేసి సిద్ధం చేసుకుని మరీ వెళ్లారు.