Share News

Uncovers Shell Companies and Political Links: లిక్కర్‌ కిక్కులో హల్‌షెల్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:56 AM

ఇక్కడ తీగలాగితే ఎక్కడో డొంక కదిలినట్లు... ఇక్కడ స్విచ్‌ నొక్కితే మరెక్కడో లైటు వెలిగినట్లు... మద్యం స్కామ్‌లో సోదాలు జరుపుతుంటే డొల్ల కంపెనీలు బయటపడుతున్నాయి. అప్పట్లో జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు సందర్భంగా... పదులకొద్దీ షెల్‌ కంపెనీల..

Uncovers Shell Companies and Political Links: లిక్కర్‌ కిక్కులో హల్‌షెల్‌

  • బయటపడుతున్న డొల్ల కంపెనీల గుట్టు

  • లిక్కర్‌ స్కామ్‌లో కొత్త బంధాలు వెలుగులోకి

  • తిరుపతి, హైదరాబాద్‌, చిత్తూరులో సోదాలు

  • సజ్జల భార్గవ్‌, మోహిత్‌ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాములే

  • హైదరాబాద్‌లో ఇషా ఇన్‌ఫ్రా కంపెనీ ఏర్పాటు

  • ఎన్నికల సమయంలో దొరికిన రూ.8 కోట్లు తనవే అన్న ప్రద్యుమ్న

  • తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు

  • రూ.600 కోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన మోహిత్‌ రెడ్డి

  • ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సమాచారం ఇవ్వాలని సిట్‌ నిర్ణయం

  • చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు

  • మోహిత్‌ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు

సేమ్‌ టు సేమ్‌..

లిక్కర్‌ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న అధికారులకు పన్నెండేళ్ల క్రితం జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారుల అనుభవాలే ఎదురవుతున్నాయి. అప్పట్లో... బెంగళూరులో తీగలాగితే సిక్కింలో మూలాలు బయటపడేవి. హైదరాబాద్‌లో తనిఖీలు చేస్తే కోల్‌కతాలో అక్రమాలు వెలుగులోకి వచ్చేవి. మనీ రూటింగ్‌ కోసం భారీ స్థాయిలో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సీబీఐ నిర్ధారించింది. అదే తరహాలో... లిక్కర్‌ స్కామ్‌లోనూ భారీగా ఏర్పాటైన కంపెనీల గుట్టు రట్టవుతోంది.

(అమరావతి/చిత్తూరు/తిరుపతి - ఆంధ్రజ్యోతి): ఇక్కడ తీగలాగితే ఎక్కడో డొంక కదిలినట్లు... ఇక్కడ స్విచ్‌ నొక్కితే మరెక్కడో లైటు వెలిగినట్లు... మద్యం స్కామ్‌లో సోదాలు జరుపుతుంటే డొల్ల కంపెనీలు బయటపడుతున్నాయి. అప్పట్లో జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు సందర్భంగా... పదులకొద్దీ షెల్‌ కంపెనీల గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్‌స్కామ్‌లోనూ అదే జరుగుతోంది. బుధవారం ‘సిట్‌’ అధికారులు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌ రెడ్డి, వైసీపీ నేత విజయానంద రెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు జరిపారు. బయట బోర్డు ఒకటి... లోపల ఉండే కంపెనీ మరొకటి! తిరుపతిలో చెవిరెడ్డి కుటుంబం ఎనిమిది కంపెనీల పేర్లతో లావాదేవీలు జరుపుతున్నట్లు సిట్‌ గుర్తించింది. చిత్తూరులో ఒక కంపెనీలో సోదాలు జరపడానికి వెళ్లగా... అక్కడ పది డొల్ల కంపెనీలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి చిత్రాలే వెలుగు చూశాయి. అన్నింటికంటే మించి... ఎన్నికల సమయంలో పట్టుబడిన రూ.8 కోట్లు తనవే అని, అవి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికి సంబంధించినవని చెప్పిన ప్రద్యుమ్నతో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డికి ఉన్న వ్యాపార సంబంధమూ బయటపడింది. అలాగే... సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు భార్గవ రెడ్డికీ లిక్కర్‌ స్కామ్‌ నిందితులతో బంధముందని తేలింది. వెరసి... సిట్‌ సోదాల్లో ఒక పెద్ద నెట్‌వర్క్‌ బయటపడింది.


చిత్తూరులో బంధం...

సోమవారం చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజయానంద రెడ్డిని ‘సిట్‌’ ప్రశ్నించింది. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాపులకు లిక్కర్‌ సరఫరా చేసే కాంట్రాక్టు ఆయనకే దక్కింది. పనిలోపనిగా చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు డబ్బులు రవాణా చేశారని సమాచారం అందింది. చెవిరెడ్డితో కలిసి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లినట్లు విజయానంద రెడ్డి చెప్పడంతో... మరింత లోతుగా ఆరా తీసేందుకు సోదాలకు దిగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నలందా నగర్‌లో ఉన్న విజయానందరెడ్డి అపార్ట్‌మెంట్‌లో ‘సీఎంఆర్‌ ప్రాజెక్ట్‌’ కార్యాలయానికి వెళ్లారు. తీరా చూస్తే అందులో... ‘వెల్‌టాస్క్‌ ఫుడ్స్‌ అండ్‌ బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కార్యాలయం నడుస్తోంది. అది రిజిస్టర్‌ కూడా కాలేదు. అందులోనే... నిఖిలానంద లాజిస్టిక్స్‌ (లిక్కర్‌ ట్రాన్స్‌పోర్ట్‌), ఎంఏసీ గ్రానైట్స్‌, సాయి సోనూ గ్రానైట్స్‌, రాజ్‌ గ్రానైట్స్‌, ఎంఎ్‌సజే ఎక్స్‌పోర్ట్స్‌, నిఖిలానంద డెవలపర్స్‌, శ్రీసాయి కన్వెన్షన్‌ సెంటర్‌, గౌతమ్‌ సాయి ఫైనాన్స్‌ వంటి సంస్థలు నడుస్తున్నట్లు తేలింది. ఇవేవీ రిజిస్టర్‌ కాలేదని, అంతర్గత కార్యకలాపాలకోసమే ఏర్పాటు చేశారని ‘సిట్‌’ గుర్తించింది. అంతేకాదు... మోహిత్‌ రెడ్డికి చెందిన ‘సీఎంఆర్‌ ప్రాజెక్ట్స్‌’లో విజయానంద రెడ్డి డైరెక్టర్‌ అని కూడా బయటపడింది. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా... ఆయా సంస్థల ఆడిట్‌ వ్యవహారాలను తామే చూస్తామని చెప్పినట్లు తెలిసింది. చిత్తూరులో సిట్‌ అధికారులు రాత్రి 8 గంటల వరకు తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు.

తిరుపతిలో... రూ.600 కోట్ల రియల్‌ దందా

తిరుపతిలో చెవిరెడ్డ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల్లో విస్తృతంగా సిట్‌ సోదాలు జరిపింది. అక్కడ కూడా అనేక కంపెనీలు బయటపడ్డాయి. కల్యాణ వేంకటేశ్వర స్వామి ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాంప్‌ మ్యాన్‌ పవర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చెవిరెడ్డి మునిరెడ్డి గార్డెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జెరైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చెవిరెడ్డి మునిరెడ్డి రోశమ్మ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మ్యాచ్‌కార్ప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జెన్సిన్‌ మెడిల్యాబ్స్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... ఇలా పలు సంస్థల పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వీటి కార్యకలాపాలేమిటి, ఆదాయమెంత.. అనే వివరాలు తెలియాల్సి ఉంది. మోహిత్‌ రెడ్డి రూ.600 కోట్ల రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు నడిపినట్లు సోదాల్లో తేలినట్లు సమాచారం. దీనిపై ఈడీతో పాటు ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని ‘సిట్‌’ నిర్ణయించినట్లు తెలిసింది.


హైదరాబాద్‌లో ‘సజ్జల’ లింకు

హైదరాబాద్‌లో మోహిత్‌ రెడ్డికి సంబంధించి... యల్లారెడ్డి గూడలోని శ్రీవిద్య ఎన్‌క్లేవ్‌లో ఉన్న సీఎంఆర్‌ ప్రాజెక్ట్స్‌, మణికొండలోని పంచవటి కాలనీలో ఐడెంట్‌ సిటీ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్‌లోని ‘భీం స్పేస్‌ ఎల్‌ఎల్‌పీ’ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. అక్కడ సిట్‌ అధికారులూ ఊహించని పరిణామం ఎదురైంది. భీం స్పేస్‌ బోర్డు ఉన్న ఆఫీసులో ‘ఇషా ఇన్‌ఫ్రా’ పేరుతో మరో సంస్థ నడుస్తోంది. అది... లిక్కర్‌ స్కామ్‌లో ఏ-1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డి కంపెనీగా అనుమానించి రికార్డులు పరిశీలించడంతో అందులో డైరెక్టర్లుగా మోహిత్‌ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ఒంగోలుకు చెందిన ప్రద్యుమ్న పేర్లు ఉన్నట్లు తేలింది. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ రూ.8.37 కోట్లు తనవే అని ప్రద్యుమ్న ప్రకటించగా... అసలు ప్రద్యుమ్న ఎవరో తనకు తెలియదని చెవిరెడ్డి ఏసీబీ కోర్టులో వాదించారు. దొరికిన డబ్బుతో తనకు ముడిపెట్టి ‘సిట్‌’ కుట్ర చేస్తోందన్నారు. తాజా సోదాలో... చెవిరెడ్డి, ప్రద్యుమ్న బంధం బయటపడింది. ‘ఇషా ఇన్‌ఫ్రా’లో డాక్యుమెంట్లు పరిశీలించగా... మోహిత్‌ రెడ్డి, భార్గవ్‌ రెడ్డి, ప్రద్యుమ్న రాసుకున్న అగ్రిమెంట్‌ కూడా లభించింది.

HGMJ.jpg

చెవిరెడ్డి ఇంటి వద్ద ఎదురుచూపులు

తిరుపతిలో చెవిరెడ్డి నివాసం, కార్యాలయంలోనూ సోదాలు జరిపేందుకు ‘సిట్‌’ అధికారులు వెళ్లినా... వాటికి తాళాలు వేసి ఉన్నాయి. తొలుత ఉదయం 9.30 గంటలకు తిరుపతి నగరం ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో చెవిరెడ్డి కార్యాలయం వున్న కేవీఎస్‌ భవనం వద్దకు వెళ్లారు. అక్కడ ‘టు లెట్‌’ బోర్డు కనిపించింది. లోపల పరిశీలించగా... అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. గతేడాది ఎన్నికల తర్వాత చెవిరెడ్డి ఈ భవనాన్ని ఖాళీ చేశారు. తుమ్మలగుంటలోని ఇంట్లోనే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిట్‌, విజిలెన్స్‌ బృందాలు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటి చేరుకున్నాయి. ఇంటికి తాళాలు వేయడంతో... అక్కడికి సమీపంలోనే ఉంటున్న చెవిరెడ్డి తల్లి, సోదరుడు రఘునాథ రెడ్డి తదితరులతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నమే చెవిరెడ్డి సతీమణి, కుమారులు హైదరాబాద్‌ వెళ్లినట్లు తెలియడంతో... చెవిరెడ్డి కుమారులకు ఫోన్‌ చేయించారు. ఇంట్లో తనిఖీలు చేపట్టాల్సి ఉందని... సాయంత్రం 7 గంటలలోగా ఇంటి తాళాలు తెరిపించకపోతే పంచనామా నిర్వహించి తాళాలు పగలగొట్టి తనిఖీలు చేపడతామని చెప్పినట్టు తెలిసింది. తాము రావడానికి రాత్రి 10 గంటలు అవుతుందని, అప్పటి దాకా గడువు ఇవ్వాలని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్టు తెలిసింది. దీంతో వారి రాక కోసం సిట్‌ అధికారులు రాత్రి పొద్దుపోయే దాకా ఎదురు చూస్తూ ఉన్నారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 07:19 AM