YSRCP Chevireddy: బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:38 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు....
లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి అనుచరుల అరెస్ట్
సిట్ అదుపులో బాలాజీ కుమార్, ఎద్దల నవీన్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దొరికిన నిందితులు
స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టిన అధికారులు
ట్రాన్సిట్ వారెంట్‌పై నేడు బెజవాడకు తరలింపు
ఎన్నికల ముందు వందల కోట్లు తరలింపు
చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి..
ఆలయాలు సందర్శిస్తూ నేపాల్ వరకు పరారీ
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సిట్ అధికారులు బాలాజీ కుమార్ యాదవ్(ఏ-35), ఎద్దల నవీన్ కృష్ణ(ఏ-36)ను అదుపులోకి తీసుకున్నా రు. ఈ ఇద్దరిని విజయవాడకు తీసుకొచ్చి జైలు కు పంపనున్నారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి, వెంకటేశ్ నాయుడు(చెవిరె డ్డి బినామీ) నుంచి బాలాజీ కుమార్, ఎద్దల నవీన్ తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థులకు చేర్చారనే ఆరోపణలున్నాయి. తాడేపల్లిలో క్యాష్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలు తరలించడంలో కీలకపాత్ర పోషించారు.
తుడా కార్లలో మద్యం ముడుపులు
మద్య నిషేధం హామీతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. మరోసారి ఎలాగైనా గెలవాలనే పథక రచనలో భాగంగా మద్యం ముడుపు లు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి హైదరాబా ద్, విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతి ప్రాంతాలకు రూ.వందల కోట్లు తరలించే బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగించారు. చెవిరెడ్డి తన మనుషుల్ని రంగంలోకి దించి వందల కోట్లను వైసీపీ అభ్యర్థులకు పంచేందుకు హైదరాబాద్ నుంచి తుడా కార్లలో తరలించారు. నమ్మకస్తులైన బాలాజీ కుమార్, ఎద్దల నవీన్ పలుమార్లు రూ.కోట్లను తెలుగు రాష్ట్రాల మధ్య తరలించారు. ఈ క్రమంలో గతేడాది మే మొద టి వారంలో కృష్ణాజిల్లా సరిహద్దుల్లో ఎన్నికల అధికారులకు రూ.8.37 కోట్లు పట్టుబడగా.. ఈ నగదు తమది కాదన్నట్లు మెల్లిగా తప్పుకొని చెన్నైకి పారిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసి కూకటివేళ్లతో పెకిలిస్తోంది. సిట్ అధికారులు అనుమానితుల్ని, వ్యాపారుల్ని, అధికారుల్ని ప్రశ్నించి సోదాలు నిర్వహించారు.
కసిరెడ్డితో మొదలై...
లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఏప్రిల్ 21న విదేశాలకు పారిపోతుండగా హైదరాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి వరుస బె ట్టి ఒక్కొక్కరిని జైలుకు పంపుతున్నారు. మాజీ సీఎం జగన్ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి (ఏ-31), మాజీ ఓఎ్‌సడీ కృష్ణమోహన్ రెడ్డి (ఏ-32), భారతీ సిమెంట్స్ కంపెనీ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప(ఏ-33), చెవిరెడ్డి(ఏ-38)తో పాటు వెంకటేశ్ నాయుడు(ఏ-34) సజ్జల శ్రీధర్ రెడ్డి(ఏ-6), బూనేటి చాణక్య (ఏ-8), దిలీ్‌ప(ఏ-30)ను విజయవాడ జైలుకు పంపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(ఏ- 39)తో పాటు బాలాజీ కుమార్, ఎద్దల నవీన్ పరారీ అయ్యారు. ఈ ముగ్గురి కోసం వేట మొదలెట్టిన సిట్ బృందాలు బాలాజీ, నవీన్‌ని మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
డబ్బుల కోసం ఫోన్ చేసి..
సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేయడంతో బాలాజీ కుమార్, ఎద్దల నవీన్ అరెస్ట్ భయంతో ఆలయాలు సందర్శిస్తూ నేపాల్ వర కూ వెళ్లారు. చేతిలో డబ్బులు అయిపోవడంతో బాలాజీ కుమార్ తిరుపతిలోని తన తండ్రికి అజ్ఞాత సెల్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. ఆన్‌లైన్‌లో పంపితే ఏటీఎం నుంచి డ్రా చేసుకున్నప్పుడు ఎక్కడ పట్టుబడతామోనని నగదు పంపాలని కోరాడు. తిరుపతి నుంచి ఒక వ్యక్తి క్యాష్ తీసుకుని ఇండోర్‌కు బయలుదేరాడు. అప్పటికే బాలాజీ తండ్రి ఫోన్‌పై నిఘా పెట్టిన సిట్ అధికారులు ఆయన కుమారుడికి డబ్బులు పంపిన వ్యక్తిని అనుసరించారు. మధ్యప్రదేశ్‌లో ని ఇండోర్‌లో ఒక హోటల్లో ఉన్న బాలాజీ, నవీన్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెం ట్ తీసుకుని విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలిసింది.