Sit Liquor Investigation: ఫైనల్‌గా ఏ ప్యాలస్‌కు
ABN , Publish Date - May 25 , 2025 | 04:11 AM
వైఎస్ జగన్ హయాంలో జరిగిన 3200 కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ కీలక ఆధారాలు వెలికితీసింది. హవాలా, బులియన్, రియల్టీ వ్యాపారాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ ‘అంతిమ లబ్ధిదారుల’ను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.
మద్యం ముడుపుల రూటు కనిపెట్టిన ‘సిట్’
హైదరాబాద్ ‘రియల్’లో భారీగా పెట్టుబడులు
బెంగళూరులో పదులకొద్దీ ఎకరాల కొనుగోలు
వాటి విక్రేతలు, మధ్యవర్తుల గుర్తింపు
ముంబై బులియన్‌లో క్వింటాళ్లకొద్దీ ‘గోల్డ్’
జీఎస్టీ చెల్లించి ఇన్వాయి్‌సల ‘కొనుగోలు’
బంగారు వ్యాపారుల నుంచి ఆరా తీస్తున్న సిట్
వివిధ మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకు ముడుపులు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
క్యాష్ కొట్టు... ఆర్డర్ పట్టు!
వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం తీరిది! అలా తెచ్చుకున్న నగదంతా ఎక్కడికి వెళ్లింది? ఏ నగరాలను చుట్టింది? ఏ దేశాలకు వెళ్లి... మళ్లీ హవాలా ద్వారా తిరిగి ఇక్కడికి చేరుకుంది? ఇలా అత్యంత కీలకమైన వివరాలను పసిగట్టడంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. సాక్షుల వాంగ్మూలాలు, నిందితులు చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాలకు తోడు... ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ‘సిట్’ పక్కాగా తీగలాగుతోంది. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రూ.3200 కోట్లు పోగేసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల వసూళ్ల వరకూ జరిగిన అన్ని అక్రమాలనూ ఆధారాలతో సహా తేల్చిన సిట్ అధికారులు... అంతిమంగా డబ్బులు ఎక్కడికి చేరాయనే సమాచారం సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఢిల్లీ, జార్ఖండ్, తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కామ్‌లతో పోల్చితే దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం జగన్ రెడ్డి పాలనలో ఏపీలో జరిగింది. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రాలు, దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈడీ సేకరించింది. ‘సిట్’ అధికారుల వినతి మేరకు... వారితో ఈ సమాచారం పంచుకుంది. దీంతో... విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు వెళ్లి కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నాయి.
పలు రాష్ట్రాల్లో ‘పెట్టుబడులు’.. మద్యం ముడుపులను హైదరాబాద్‌లో హవాలా, ముంబైలో బులియన్ ద్వారా ‘అంతిమ లబ్దిదారు’ చెప్పిన చోటుకు చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రాజ్ కసిరెడ్డి(ఏ1) గ్యాంగ్ వసూలు చేసిన డబ్బులో సుమారు వెయ్యి కోట్లు హైదరాబాద్‌లోని స్థిరాస్తి వ్యాపారస్తుల ద్వారా బెంగళూరులో పెట్టుబడులుగా మారినట్లు ఆధారాలు లభించాయి. సజ్జాపుర, చిక్క తిరుపతి, హెచ్‌ఎ్‌సఆర్ లేఔట్ ప్రాంతాల్లో 2022 నుంచి 2024 మధ్య పదులకొద్దీ ఎకరాలు కొనుగోలు చేశారని... వాటి ‘అసలు’ యజమాని ఎవరనేది కూడా ‘సిట్’ గుర్తించిందని తెలిసింది. ఆ ఆస్తులు, వాటి విక్రేతలు, మధ్యవర్తులను సైతం గుర్తించి... వారితోనూ కూపీ లాగుతోంది. మరోవైపు ముంబైలో బులియన్ వ్యాపారుల నుంచి బంగారం కొనుగోలు చేసినట్లు లభించిన జీఎ్‌సటీ బిల్లులపై ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వందల కోట్ల రూపాయలతో క్వింటాళ్లలో కొనుగోలు చేసిన బంగారం ఎటు వెళ్లిందనే అంశంపై దృష్టి సారించగా... ఎక్కువ శాతం బిల్లులు కేవలం జీఎ్‌సటీ చెల్లించి తీసుకున్నట్లు తేలింది. అక్రమ మార్గంలో దోచుకున్న డబ్బును సక్రమమని చూపించుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇది. బంగారం వ్యాపారుల నుంచి పలు వివరాలు సేకరించిన సిట్ అధికారులు కేవలం జీఎ్‌సటీ చెల్లించి బిల్లులు తీసుకున్న వ్యక్తులు ఆ డబ్బు ఎక్కడికి చేర్చారనే అడ్రస్ కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ చిరునామా వెతికే క్రమంలో మరింత ముందుకు వెళితే.... అదంతా ఏ ‘ప్యాలె్‌స’కు చేరిందో తెలిసిపోతుంది.