Share News

AP Assembly Sessions: గౌరవ.. సభ!

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:17 AM

శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్ధరించే బాధ్యత కూడా కూటమి సర్కారుపై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్‌ హయాంలో ఐదేళ్లపాటు శాసనసభ అంటే ‘చర్చకు కాదు, రచ్చకు వేదిక’ అన్నట్లుగా మారింది.

AP Assembly Sessions:  గౌరవ.. సభ!

  • రచ్చ కాదు..చర్చకు వేదిక కావాలి

  • గత సంప్రదాయాలను పునరుద్ధరించాలి

  • గతంలో ఏడాదికి 60 రోజులు సమావేశాలు

  • వైసీపీ హయాంలో 30-40 రోజులతో సరి

  • బడ్జెట్‌లో పద్దులపై చర్చలు జరిగిందే లేదు

  • మొక్కుబడిగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌

  • నాడు.. దాడి, బూతులు, దూషణలతో రచ్చ

  • నేడు.. సభ ప్రతిష్ఠను నిలబెట్టాల్సిన అవసరం

  • నేడు గవర్నర్‌ ప్రసంగంతో శ్రీకారం

నేటి నుంచి శాసనసభ సమావేశాలు! హోరాహోరీగా వాదనలు... ప్రతిపక్షం ఆందోళనలు... అది శ్రుతిమించితే సస్పెన్షన్లు... వీటన్నింటితోపాటు ప్రజా సమస్యలు, పద్దులు, బిల్లులపై అర్థవంతమైన చర్చలు! ఇవన్నీ కలిపితేనే ‘గౌరవ’ శాసనసభ! కానీ... వైఎస్‌ జగన్‌ హయాంలో అసెంబ్లీకి అర్థమే మారిపోయింది. సభ అంటే చర్చ కాదు, రచ్చ అనే పేరు స్థిరపడింది. కూటమి సర్కారులోనైనా ఈ పద్ధతి మారాలని... సభకు పూర్వగౌరవం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు సోమవారమే శ్రీకారం! గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. సుమారు 20 పనిదినాలు అసెంబ్లీ నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో... శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్ధరించే బాధ్యత కూడా కూటమి సర్కారుపై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్‌ హయాంలో ఐదేళ్లపాటు శాసనసభ అంటే ‘చర్చకు కాదు, రచ్చకు వేదిక’ అన్నట్లుగా మారింది. చంద్రబాబుతోపాటు నాటి విపక్ష నేతలపై విరుచుకుపడటం, బూతులతో దాడి చేయడం, నోరెత్తకుండా మైకులు కట్టేయడం... ఇదీ పరిస్థితి! చివరికి... ‘ఇది కౌరవ సభలా మారింది. గౌరవ సభలా మారేదాకా ఇక్కడ అడుగు పెట్టను’ అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి మరీ బయటికి వచ్చేశారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సభలో అడుగు పెట్టారు. అటు... జగన్‌ మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. అనర్హత వేటు భయంతో సోమవారం మాత్రం వైసీపీ సభ్యులు సభకు వస్తున్నారు. ఆ తర్వాతి సంగతిపై స్పష్టత లేదు.


ఎన్నెన్ని రోజులు...

గతంలో శాసనసభ సమావేశాలు ఏటా సగటున 60 రోజులపాటు జరిగేవి. బడ్జెట్‌ సమావేశాలు 30 రోజుల దాకా నిర్వహించేవారు. అన్ని అంశాలు చర్చకు వచ్చేవి. బడ్జెట్‌ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఆయా రంగాలపై లోతైన చర్చ జరిగేది. విపక్షాల వాదనలు, ప్రభుత్వం తరఫు సమాధానంతో సంబంధిత శాఖకు సంబంధించిన సమగ్ర చిత్రం ఆవిష్కృతమయ్యేది. కానీ... ఇప్పుడు చిత్రం మారిపోయింది. రానురాను ‘సభా సమయం’ చిక్కిపోతూ, మొక్కుబడి తంతులామారింది. జగన్‌ హయాంలో ఏడాదికి 30-40 రోజులు జరిగితేనే గొప్ప అన్నట్లుగా తయారైంది. బడ్జెట్‌ సమావేశాల విషయంలో వ్యవహరించాల్సిన సంప్రదాయాలను అటకెక్కించారు. గత ఐదేళ్లు పద్దులపై చర్చే జరగలేదు. అన్నీ గెలిటెన్‌ చేసి ఆమోదించడమే! ఇక... శాఖల సంగతులు ప్రజలకు తెలిసేదెలా? ఈ నేపథ్యంలో కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాల రోజులను పెంచాలని... బడ్జెట్‌ సమావేశాల్లో పద్దులపై సమగ్ర చర్చకు ఆస్కారం కల్పించాలని ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటున్నారు.


ఆత్మస్తుతి... పరనింద!

జగన్‌ హయాంలో అసెంబ్లీని ‘ఆత్మస్తుతి... పరనింద’కు వేదికగా మార్చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా... ‘అభినవ అంబేడ్కర్‌... నేటి గాంధీ’ అని జగన్‌ను కీర్తించేందుకు వైసీపీ సభ్యులు, మంత్రులు పోటీపడ్డారు. ప్రశ్నోత్తరాలు అంతంత మాత్రమే! ఇక జీరో అవర్‌ మొక్కుబడిగా సాగేది. చాలామంది వైసీపీ సభ్యులే ‘ఇదేం సభ’ అని అంతర్గత చర్చల్లో వాపోయే వారు. ప్రస్తుతానికి వైసీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు పూర్తిగా హాజరయ్యే అవకాశం కనిపించడంలేదు. వచ్చినా... ఉన్నదే 11మంది కాబట్టి సభకు అంతరాయం కల్పించే స్థాయిలో ‘ఆందోళనలు’ చేయలేరు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తిస్థాయిలో అర్థవంతంగా నడిపించే బాధ్యత కూటమి సర్కారుపైపడింది. బడ్జెట్‌ సమావేశాలు 20 పనిదినాలు జరిగే అవకాశముండటంతో ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను స్పృశించే అవకాశం ఉంది. గతంలో ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను సభలో చెప్పేందుకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ సమస్యలు సభ దృష్టికి తెచ్చి పరిష్కరించే అవకాశం కల్పించాల్సి ఉంది. సోమవారం, మొదటిరోజు గవర్నర్‌ ప్రసంగం ఉం టుంది. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ చేపడతారు. దీనిని గతంలోలాగా ముఖ్యమంత్రిని కీర్తించే కార్యక్రమంలా మార్చకుండా అసలు వాస్తవాలు వివరించేలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.


నాడు జరిగిందిలా..

అసెంబ్లీ సమావేశాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు ఉన్న సభా సంప్రదాయాలను పూర్తిగా పక్కనపెట్టింది. సభను దారిలో పెట్టాల్సిన స్పీకర్‌ సైతం జగన్‌ కనుసైగలతో ఓ పార్టీ సభలాగా నిర్వహించారు. సభలో అప్పటి ప్రతిపక్ష టీడీపీ సభ్యులెవరైనా ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడల్లా ఎదురుదాడికి దిగేవారు. బూతులు, దూషణలు, అవహేళనలతో సభా మర్యాదను మంటగలిపారు. కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచేలా దూషించారు.

ఎన్నో కీలకాంశాలు...

  • పలు పథకాలు నిధులు లేక నీరసిస్తున్నాయి. వాటికి జవసత్వాలు కల్పించేలా చర్చకు, చర్యలకు అసెంబ్లీని ఉపయోగించుకోవాలి.

  • కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తాలూకా పలు చట్టాలను రద్దు చేసి, మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆ వివరాలను, అవసరాన్ని ప్రజలకు వివరించాలి.

  • ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టడానికి పలు విజన్‌లను రూపొందించారు. మరీముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర - 2047’ ఉద్దేశాలు, లక్ష్యాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అసెంబ్లీని ఉపయోగించుకోవాలి.

  • రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన, లక్షలాది మంది రైతులను ఇక్కట్లలోకి నెట్టిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గం కనుక్కోవాలి.

Updated Date - Feb 24 , 2025 | 07:11 AM