Share News

Kadapa Migrants: కువైత్‌ సంస్కరణలతో కొత్త కష్టాలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:16 AM

కువైత్‌లో గడపగడపకు కడపతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉంది. కువైత్‌లోని విదేశీయుల్లో అత్యధికంగా 10లక్షలమంది

Kadapa Migrants: కువైత్‌ సంస్కరణలతో కొత్త కష్టాలు

  • మన ఎన్‌ఆర్‌ఐల్లో కడపవారే అక్కడ అత్యధికం

  • విజన్‌ 2035 ప్రకారం విదేశీ వీసా, నివాసనిబంధనలను కఠినతరం చేసిన కువైత్‌

  • తెలుగుప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

  • అరెస్టులు భారంగా మారిన రెసిడెన్సీ వీసా

  • నెల సంపాదన అద్దెకే చాలడం లేదు

  • వాపోతున్న తెలుగు ప్రవాసీయులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): కువైత్‌లో గడపగడపకు కడపతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉంది. కువైత్‌లోని విదేశీయుల్లో అత్యధికంగా 10లక్షలమంది భారతీయులు ఉన్నారు. వీరిలో మలయాళీల తర్వాత ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వారే అత్యధికం. దీంతో కువైత్‌ ప్రభు త్వం తీసుకునే కీలక నిర్ణయాలు మనవాళ్లను అమితంగా ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమూల మార్పులను ప్రతిపాది స్తూ కువైత్‌ ప్రభుత్వం విజన్‌ 2035ను రూపొందించింది. ఈ విజన్‌ తమ అవకాశాలకు గొడ్డలిపెట్టుగా మారనుందని తెలుగు ఎన్‌ఆర్‌ఐల్లో ఆందోళన నెల కొంది. వీసా, ఉపాధి నిబంధనల ఉల్లంఘనల విషయంలో కువైత్‌ కఠినంగా ఉంటోంది. విజన్‌ డాక్యుమెంట్‌లో కూడా దీనిపై గట్టి చర్యలను ప్రతిపాదించారు. ఇందులోభాగంగా డిజిటల్‌ విధానాన్ని అనుసరిస్తూ విదేశీయుల ఉపాధి, నివాస, ఆర్థిక, నేర వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కారణం ఏమైనా కువైత్‌లో నివసిస్తున్న తెలుగు ఎన్‌ఆర్‌ఐలు వీసా, ఉపాధి నిబంధనలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. తా జా తనిఖీలు వారిలో అత్యధికులకు ఇబ్బందిగా మా రాయి. విదేశీయులు తమ చిరునామా సహా నివాస వివరాలన్నీ సమర్పించాలని ప్రభుత్వం షరతు పెట్టింది. ఈ షరతు గతంలో లేదు. గత ఏడాది జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులతో పాటు 50 మంది భారతీయులు మరణించా రు. ఈ ఘటన తర్వాతే కొత్త ఆంక్షలను కువైత్‌ తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని వ్యక్తులు అత్యధికంగా ఉంటూ, వారి వివరాలు లేకపోవడంతో నీటి సరఫరా, విద్యుత్‌ పంపిణీ నిర్వహణ కష్టమవుతోంది. పవర్‌ లోడింగ్‌ సమస్య చాలాసార్లు భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీస్తోంది. దీంతో కువైత్‌ ప్రభుత్వం విదేశీయులు నివసించే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసింది.


పెనంపై నుంచి పొయ్యిలోకి...

కువైత్‌లోని సాల్మీయా, జహెరా, హావళ్లీ, ఖైతాన్‌, ఫర్వానీయా, జ్లీబ్‌ షుయూఖ్‌ ప్రాంతా ల్లో ప్రవాసాంధ్రులు ఎక్కువగా నివసిస్తున్నారు. అత్యధికులు నిబంధనలకు విరుద్థంగా ఉంటున్నారు. కొత్త విజన్‌లో భాగంగా పోలీసులు ఈ ప్రాంతాలను ప్రక్షాళన చేస్తున్నారు. నివాస వివరాలు లేని విదేశీయులను ప్రభుత్వం పంపించివేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది తెలుగువారిని స్వదేశానికి బలవంతంగా తిప్పిపంపించగా, మరికొందరు జైళ్లలో ఉన్నారు. విదేశీయులు ఉండటానికి తప్పుడు విధానంలో నివాస ఏర్పాట్లు చేసి పెడుతున్న ఓ దళారీని పోలీసులు విచారించారు. అతని వద్ద లభించిన బతఖా మదనీ(రెసిడెన్సీ వీసా) ఆధారంగా చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త విజన్‌లో భాగంగా ఈ తరహా వీసాల జా రీకి నివాస వసతి వివరాలను సమర్పించడా న్ని తప్పనిసరి చేశారు. నిజానికి, ఈ నిబంధన ప్రవాసీయులకు రక్షణ కలిస్తుంది. ఇల్లు అద్దెకు తీసుకునే ముందు విదేశీయులు 120-150 దినార్లు చెల్లించి యజమానితో ఒప్పందం చేసుకుంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఆ ఒప్పందాన్ని యజమాని ఎప్పుడైనా రద్దు చేసుకొని, అద్దెకు ఉంటున్నవారిని పంపించివేయవచ్చు. దీంతో చాలామంది నెలకు 25 దినార్లకు (సుమారు రూ.7 వేలు) ఒక మంచం తీసుకొని కాలం గడుపుతున్నారు. కొత్త నిబంధనల ప్రకా రం, నెలకు కనీసం 250 దినార్ల(సుమారు 71 వేల రూపాయలు) అద్దె చెల్లించి బతఖాను అప్డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత నగదు చెల్లించడం తమ వల్ల కాదని తెలుగు ప్రవాసీయులు వాపోతున్నారు. ఈ నిబంధన తమను పెనంపైనుంచి పొయ్యిలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైత్‌లో పని చేస్తున్న అనేక మంది తెలుగు ప్రవాసీయుల వేతనాలు నెలకు 200-300 దినార్ల (57 నుండి 85 వేల రూపాయలు) లోపు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 04:16 AM