విభజన హామీలు నెరవేర్చాలి: సీపీఎం
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:52 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న విభజన హామీలను నెరవేర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
నందికొట్కూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న విభజన హామీలను నెరవేర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖపట్నానికి రానున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకపోగా... వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రతి సంవత్సరం రూ.50 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కింద కేటాయిస్తామని ఇచ్చిన హామీలను అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి నిధుల కేటాయింపులో కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పక్కీర్ సాహెబ్, గోపాలకృష్ణ, మారెన్న, ఉస్మాన్‌బాషా, సలాంఖాన్, రంగమ్మ, హుస్సేనమ్మ, జయరాణి తదితరులు పాల్గొన్నారు.