Share News

Fake website in Srisailam: శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం

ABN , Publish Date - Nov 24 , 2025 | 08:00 AM

శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. ముందస్తుగా వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు.. తాము మోసపోయామని తెలియడంతో అసలు విషయం బయటపడింది.

Fake website in Srisailam: శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం
Srisailam Temple

నంద్యాల జిల్లా, నవంబర్ 24: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వల వేసి.. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని 'జస్ట్ డయల్' యాప్ పేరిట మోసం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ టూరిజం వసతి గదుల పేరిటా నకిలీ వెబ్‌సైట్‌తో వేలకు వేలు దోచుకుంటున్నారు. దీంతో భక్తులు నమ్మి వసతి గదులు బుక్ చేసుకుని.. తీరా అక్కడికి చేరుకున్నాక ఒక్కసారిగా కంగుతింటున్నారు. డూప్లికేట్ వెబ్‌సైట్‌లతో లబోదిబోమంటూ తలలు పట్టుకుంటున్నారు.

4.jpg


బయటపడిందిలా..

శ్రీశైలం ఏపీ టూరిజంనకు చెందిన హరిత గెస్ట్ హౌస్ రూములను బెంగుళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ సుమారు రూ.30వేలు ఆన్‌లైన్ పేమెంట్ చేసి రూములు బుక్ చేసుకుని అక్కడికి వెళ్లారు. ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న రశీదు బిల్లును చూపించగా.. కౌంటర్లో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన బుక్ చేసుకున్న వెబ్‌సైట్ నకిలీదని సిబ్బంది చెప్పడంతో సదరు ఆర్మీ ఆఫిసర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. అధికారులు మాత్రం కేటుగాళ్లను పట్టుకోలేకపోతున్నారు. దీంతో మల్లన్న భక్తులు మోసపోయి ఆందోళనకు గురవుతున్నారు.

2.jpg


ఏపీ టూరిజం, శ్రీశైలం దేవస్థానం వసతి గదుల విభాగం పేరిట.. ఆన్‌లైన్ సిస్టమ్‌లో నకిలీ సైట్‌లను సృష్టించి భక్తుల నుంచి వేలకు వేలు దోచుకుంటున్నా ఆలయ అధికారులు ఈ కేటుగాళ్లను గుర్తించలేకపోతున్నారు. దీంతో భక్తులకు జరుగుతున్న మోసాలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల గురించి తెలియడంతో స్థానికులు, భక్తులు అయోమయంలో పడ్డారు. సైబర్ మోసాల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. నకిలీ యాప్‌లను క్రియేట్ చేస్తూ భారీ స్థాయిలో నగదు దండుకుంటున్న కేటుగాళ్ల నుంచి భక్తులను ఎలా కాపాడాలోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

1.jpg


నకిలీ ఫొటోలు, ఐడీలతో..

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచీ శ్రీశైలం క్షేత్రానికి వచ్చి శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు భక్తులు. అలాంటి పుణ్యక్షేత్రంపై సైబర్ కేటుగాళ్ల కళ్లుపడ్డాయి. ఆలయ వసతి విభాగానికి సంబంధించిన ఫొటోలతో జస్ట్ డయల్ యాప్‌లో నకిలీ పోస్ట్ పెట్టి 'రూములు లభించును' అనే ప్రకటనతో.. కావలసినవారు ఫోన్ చేయాలని సూచిస్తూ ఓ నంబర్‌ను మెన్షన్ చేశారు. శ్రీశైల దేవస్థానం భక్తుల వసతి సౌకర్యార్థం ఉన్న గంగా-గౌరీ సదన్, మల్లికార్జున సదన్, పాతాళేశ్వర సదన్ వంటి ఫొటోలతో ఫేక్ ఐడీలు సృష్టించి భక్తులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. వీటిని నమ్మి.. దూర ప్రాంతాల నుంచి అక్కడకు చేరుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

3.jpg


దీంతో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(EO) శ్రీనివాసరావు భక్తులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్‌సైట్లతో భక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం.. డూప్లికేట్ సైట్‌లతో మోసపోయిన భక్తుల ఫిర్యాదుతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


ఇవీ చదవండి:

జగనన్న కాలనీలో జంతర్‌మంతర్‌

ఘనంగా సత్యసాయి శతజయంతి

Updated Date - Nov 24 , 2025 | 08:12 AM