Share News

జగనన్న కాలనీలో జంతర్‌మంతర్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:04 PM

గత ప్రభుత్వ హయాంలో ఊళ్లు కడతామంటూ జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో అటు నేతల పోకడలు, ఇటు అధికారుల ఇష్టారాజ్యంతో అవకతవకలకు అడ్డే లేకుండా పోయింది. ప్రతిచోటా అవినీతి రాజ్యమేలింది.

జగనన్న కాలనీలో జంతర్‌మంతర్‌
మిల్లంపల్లి జగనన్న కాలనీ

జగనన్న ఇళ్ల స్థలాల్లో మాయ

ఆన్‌లైన్‌లో పట్టాల సంఖ్య ఒకరకంగా, భౌతికంగా చూస్తే మరోరకంగా..!

మిల్లంపల్లి సమీపంలో వేసిన ప్లాట్లలో అక్రమాలు కోకొల్లలు

ఒక్కో నంబర్‌ ఇద్దరు ముగ్గురికి కేటాయింపు

పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు

విచారణలోనూ తిమ్మినిబమ్మిని చేసి సక్రమమేనంటూ అధికారుల నివేదికలు

త్రిపురాంతకం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వ హయాంలో ఊళ్లు కడతామంటూ జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో అటు నేతల పోకడలు, ఇటు అధికారుల ఇష్టారాజ్యంతో అవకతవకలకు అడ్డే లేకుండా పోయింది. ప్రతిచోటా అవినీతి రాజ్యమేలింది. అటువంటి జాబితాలో ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి జగనన్న కాలనీలోని ప్లాట్లలో జరిగిన అక్రమాల చిట్టా పతాక స్థాయిలో నిలిచింది. వివరాల్లోకెళ్తే... ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి టోల్‌గేట్‌ సమీపంలో వేసిన పెద్ద లే అవుట్‌లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దుతామని గత వైసీపీ ప్రభుత్వంలో నేతలు గొప్పగా చెప్పారు. ఆ ప్రకారం పట్టాలు ఇచ్చారు కానీ అవి ఎవరికి చెందాయనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆన్‌లైన్‌లో పట్టాలు ఇచ్చిన జాబితా 1,316 మందిగా చూపుతోంది. కానీ భౌతికంగా చూస్తే పట్టాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు.

తహసీల్దార్‌, వీఆర్వోలు భారీగా వసూలు

మిల్లంపల్లి లే అవుట్‌లో గతంలో ఇక్కడ పనిచేసిన ఒక తహసీల్దార్‌తోపాటు ఒక వీఆర్వో అక్రమాల్లో సిద్ధహస్తులై ప్లాట్లలో పట్టా ఇచ్చేందుకు పలువురు లబ్ధిదారుల నుంచి భారీగా వసూలు చేశారని తెలిసింది. అదే స్థాయిలో పట్టాలు కూడా జారీ అయ్యాయని చెబుతున్నారు. ఒకే నంబర్‌తో ఇద్దరు ముగ్గురేసి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం వివాదాస్పదమైంది.


బినామీల గుప్పిట్లో ప్లాట్లు

ఈ కాలనీలో పలు ప్లాట్లు బినామీల గుప్పిట్లో ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయపార్టీ నాయకులు, వ్యాపారవేత్తల చేతుల్లో కొన్ని ప్లాట్లు ఇతరుల పేర్లతో జారీ చేయబడి వారివద్ద ఉండిపోయినట్టు తెలుస్తోంది. అధికారులు విచారణ సమయంలో కూడా వీటికి మళ్లీ అసలైన జాబితాలోకి చేర్చి విచారణ తంతు ముగిస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు విచారణ జరిపినా అక్రమాలకు పాల్పడిన అధికారులే అడ్డుపడుతూ వాటి లెక్క తేలకుండా చూస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి పారదర్శకంగా విచారణ జరిపి పట్టాల లెక్క తేల్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

విచారణలోనూ తమదైన ముద్ర

కొన్ని ప్లాట్లలో ఒకే నంబరుతో పలువురికి పట్టాలు ఇచ్చారని మూడు నెలల క్రితం ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. దీనిపై మార్కాపురం సబ్‌కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ చేశారు. ఇందులో కూడా అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి విచారణ కూడా తమకు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. అదే వీఆర్వో మళ్లీ ఈ విషయంలో తనదైన శైలిలో వసూళ్లకు తెరదీశారు. పట్టాల పరిశీలన సమయంలో నకిలీ పట్టాలను కూడా అసలైన పట్టాలుగానే చూపేందుకు మళ్లీ వారి వద్ద వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతిసారీ విచారణలు అంటూ సొమ్ము చేసుకోవటం తప్ప అసలు నకిలీ పట్టాల చిట్టా విప్పే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో జగనన్న కాలనీలో అక్రమాల లెక్క మాత్రం తేలటం లేదు.

Updated Date - Nov 23 , 2025 | 11:10 PM