కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:54 AM
గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిచిందని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

కొత్తపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిచిందని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మండలంలోని ఎదురుపాడులో రూ.35 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయాన్ని, రూ.23.90 లక్షలతో నిర్మించిన రైతుభరోసా కేంద్రాన్ని, అలాగే దుద్యాలలో రూ.35 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు షేక్ నజీయా, చందమాల శోభలతల అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. దుద్యాల గ్రామ శివారులోని మెయిన్ రోడ్డు నుంచి జంబులమ్మ గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.60 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు పూర్తి చేశామని తెలిపారు. ఇదిలావుంటే ఎదురుపాడు గ్రామ టీడీపీ నాయకులు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి జడ్వారిపల్లె వద్ద లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే త్రీఫేజ్ కరెంటు కోసం సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం దుద్యాల గ్రామ సభలో గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన రామానాయుడుకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.35వేల విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ కుసుమలత, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, టీడీపీ మండల కన్వీనర్ నారపురెడ్డి, పీఆర్ డీఈ ధనిబాబు, వైస్ ఎంపీపీలు సింగారం వెంకటరమణ, జయమ్మ, స్థలదాత మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మన్సూర్‌వలి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ, ఏడీఏ ఆంజనేయ పాల్గొన్నారు.