PVN Madhav: జగన్ అరెస్ట్ తప్పదు: ఏపీ బీజేపీ చీఫ్
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:48 PM
వైఎస్ జగన్ అరెస్ట్ తప్పదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. ఆయన అరెస్ట్‌ను ఎవరూ ఆపలేరన్నారు.
కర్నూలు, జులై 29: మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా అరెస్ట్ అవుతారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. దానిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మద్యం కుంభకోణం అందరికీ తెలిసిందనన్నారు. కానీ వైఎస్ జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు.. పోలీసులను బెదిరిస్తున్నాడంటూ వైఎస్ జగన్ వ్యవహారశైలిని ఈ సందర్బంగా ఆయన ఎండగట్టారు. మద్యం కుంభకోణం అందరికీ తెలిసిందేనని.. ఈ వ్యవహారంలో నగదు రూపంలోనే లావాదేవీలు జరిగాయని గుర్తు చేశారు. ఈ మద్యం కుంభకోణంపై విచారణ జరిగి.. దోషులను శిక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దెబ్బలు తిని కోలుకో లేని స్థితిలో వైఎస్ జగన్ ఉన్నారన్నారు.
అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకృతమైందనే వాదనతో తాను ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు. అయితే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు తరలి పోకుండా ఈ ప్రాంత నేతలు నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
రాయలసీమ డిక్లరేషన్ అమలుకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యామని ఆయన తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని సుస్పష్టం చేశారు.
అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని నిలిపే ఆలోచన ఏదీ లేదన్నారు. అయితే ఏపీ ఆలోచన వేరు, తెలంగాణ ఆలోచన వేరని తెలిపారు. కానీ ఉమ్మడి ప్రయోజనాలు కోసం పని చేస్తునే.. స్వతంత్రంగానే బీజేపీ ఆలోచన చేస్తుందని చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఎన్నికల్లో నామినేటేడ్ పదవులు ఉంటాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్ దేశాధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read latest AndhraPradesh News And Telugu News