Share News

Kurnool Farmers : కర్నూలు పల్లెలు ఖాళీ!

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:35 AM

పల్లెలు.. ఇప్పుడు పనులు లేక ప్రజలు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లక్షల కుటుంబాలకుపైగా తెలంగాణ, గుంటూరు ప్రాంతాల్లో పత్తి తీత, మిరప కోత పనులకు వెళ్లిపోయారు.

Kurnool Farmers : కర్నూలు పల్లెలు ఖాళీ!

  • పనులు లేక వలస బాట

  • గుంటూరు, తెలంగాణ ప్రాంతాల్లో పత్తి, మిరప కోత పనులకు పయనం

కర్నూలు జిల్లాలోని పల్లెలు ఖాళీ అవుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ముగియగానే పనులు వెతుక్కుంటూ రైతులు, వ్యవసాయ కూలీలు మూటముల్లె సర్దుకుని పిల్లపాపలతో వలస బాటన సాగిపోతున్నారు. ఒక్కప్పుడు వ్యవసాయ కూలీలు మాత్రమే వలస వెళ్లేవారు. ఇప్పుడు వ్యవసాయం కలసిరాక.. పెట్టుబడి అప్పులు తీర్చేదారి లేక.. బతుకు పోరులో అన్నదాతలు సైతం వలస బండెక్కుతున్నారు.

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

కర్నూలు జిల్లాలో ఎటు చూసినా తాళాలు వేసిన ఇళ్లే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఖరీఫ్‌ పనులతో కళకళలాడిన పల్లెలు.. ఇప్పుడు పనులు లేక ప్రజలు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లక్షల కుటుంబాలకుపైగా తెలంగాణ, గుంటూరు ప్రాంతాల్లో పత్తి తీత, మిరప కోత పనులకు వెళ్లిపోయారు. వయసు మళ్లిన వృద్ధులను ఇళ్ల దగ్గరే వదిలేసి.. పొట్ట చేతపట్టుకుని వలసబాట పట్టారు. కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెసీమలలో రైతులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టాలు.. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్‌.. వీరి కష్టాలు విన్నారు. ఉన్నచోటే పనులు కల్పించి వలసలు ఆపుతామని హామీ ఇచ్చారు. కానీ, వలసలు ఆపే దిశగా తీసుకున్న చర్యలు నామమాత్రంగా ఉండడంతో పల్లెలు బోసిపోతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో ఏ ఊరికి వెళ్లినా.. తలుపులకు తాళం వేసిన ఇళ్లు, ఆ ఇళ్లకు కాపలాగా ఉన్న వృద్ధులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది పంటలు ఆశాజనకంగా ఉన్నా.. మిరప, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయి.


మిరప కోత.. పత్తి తీత

గుంటూరు జిల్లాలో మిరప కోత పనులు ఎక్కువగా సాగుతున్నాయి. దీంతో ఎక్కువ మంది ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ జిల్లాలో ఏ పల్లెలో చూసినా కర్నూలు జిల్లా వలస కూలీలే కనిపిస్తున్నారు. పురుషులకు రూ.650-700, మహిళలకు రూ.550-600 కూలి ఇస్తున్నారు. లేదంటే ఎకరాకు రూ.20-25 వేల చొప్పున ఒప్పందం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో పత్తి తీత పనులు జరుగుతున్నాయి. అక్కడ కిలో పత్తి తీతకు రూ.13 ప్రకారం భార్యభర్తలు ఇద్దరు కలసి రోజుకు 100-120 కిలోలు పత్తి తీస్తే రూ.1,300-1,500 వరకు వస్తుంది. రెండు నెలలు భార్యభర్తలు ఇద్దరు కష్టపడితే తిండిఖర్చులు పోను రూ.50 వేలు సంపాయించవచ్చనే ఆశతో వలస బాటపట్టారు. బడికెళ్లే పిల్లలను సైతం బడిమాన్పించి తీసుకెళ్తుండడంతో పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పడిపోతుంది.

ఆదుకోని ఉపాధి పథకం

గ్రామీణ ఉపాధి హామీ పథకం కర్నూలు రైతులకు, కూలీలకు భరోసా ఇవ్వలేకపోతుంది. జిల్లాలో 1.45 లక్షలకు పైగా జాబ్‌ కార్డులు ఉన్నాయి. జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద పని దినాలు కల్పిస్తారు. ఒక ఇంట్లో నలుగురు పనికి వెళ్తే 25 రోజుల్లో వంద పని దినాలు పూర్తవుతాయి. ఆతర్వాత ఉపాధి పని చూపించరు. దీంతో పూట గడవాలంటే వలసే శరణ్యం. అంతేకాదు రోజంతా మట్టి పనులు చేస్తే ఇచ్చే కూలీ రూ.250-300 మించడం లేదు. రెండు నెలలుగా ఉపాధి కూలీ డబ్బులు చెల్లించలేదు. దీంతో కూలీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. రోజుకు లక్ష మందికి ఉపాధి చూపాలనే లక్ష్యం ఉన్నప్పటికీ 45-55 వేల మందికి మించి పని కల్పించలేక పోతున్నారు. అందులోనూ 10-12 వేలకుపైగా బోగస్‌ హాజరు ఉంటోంది.


కొడుకు కోడలు ఎప్పుడొస్తారో?

ఈ వృద్ధురాలి పేరు పెద్ద నరసమ్మ(73). కర్నూలు జిల్లా మండల కేంద్రం కోసిగిలోని వాల్మీకి నగర్‌. నలుగురు కొడుకులు హనుమంతు, రామాంజనేయులు, హనుమేశ్‌, ఈరన్న, కూతురు లక్ష్మి గుంటూరుకు మిరప కోత వెళ్లారు. ఇంటికి కాపలాగా నరసమ్మ ఉన్నారు. వలస వెళ్లిన కొడుకులు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. ‘‘బడికెళ్లే పిల్లలను వెంటబెట్టుకొని సుగ్గివెళ్లారు.. అక్కడ ఎట్లా ఉన్నారో.. ఎట్లా బతుకుతారో.. ఆ దేవుడు మా బతుకులు ఇట్లా రాసినాడయ్యా’’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

పెట్టుబడి మట్టిపాలై!

ఇంటికి కాపలాగా ఉన్న ఈ దివ్యాంగుడి పేరు బొల్లొలి ఈరన్న(68). 4 ఎకరాల పొలం ఉంది. పత్తి సాగు చేస్తే.. తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గింది. ఆదోని పత్తి మార్కెట్‌ తీసుకెళితే క్వింటా రూ.6 వేలలోపే అమ్మకోవాల్సి వచ్చింది. రూ.లక్షలకు పైగా పెట్టుబడి పెడితే అప్పులే మిగిలాయి. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. భార్య నరసమ్మ, కొడుకులు రమేశ్‌, ఈరేశ్‌ ఇద్దరు భార్యపిల్లలతో కలసి కర్ణాటకలోని దేవదుర్గకు పత్తితీత పనులకు వలస వెళ్లారు. ‘‘ఈడ పనుల్లేవు.. వలస వెళితే 4 రూకలు వెనకేసుకొని అప్పులకు వడ్డీలైనా కట్టవచ్చు. అందుకే నా భార్య, కొడుకులు వలస వెళ్లారు’’ అని ఈరన్న ఆవేదన వ్యక్తం చేశారు.


  • ఎక్కడ నుంచి ఎక్కడిదాకా?

  1. కోసిగి మండలం పల్లెపాడు ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఆ పల్లెలో 1,500 కుటుంబాలు ఉంటే 1,100 కుటుంబాలు గుంటూరు జిల్లా, కర్ణాటకలోని దేవదుర్గ, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలస వెళ్లారు.

  2. దుద్ది గ్రామంలో 1,200 కుటుంబాలు ఉంటే 650 కుటుంబాలు వలస బండెక్కాయి.

  3. చిర్తనకల్లు, మూగలదొడ్డి, డి.బెళగల్‌, పెద్దభూంపల్లి, చింతకుంట, కోసిగి, అర్లబండ, వందగల్లు, కామన్‌దొడ్డి, అగసనూరు గ్రామాలు సగానికి పైగా ఖాళీ అయ్యాయి.

  4. ఆదోని మండలం ఆరేకల్లులో 650కిగాను 350 కుటుంబాలు వలసదారిన సాగిపోయాయి.

  5. గణేకల్లులో 700కుగాను 400 కుటుంబాలు పిల్లాపాపలతో తరలిపోయాయి.

  6. కోడుమూరు మండలం కల్లపారిలో బీసీ, ఎస్సీ కాలనీలు ఖాళీ అయ్యాయి. ఆ పల్లెలో 250కిపైగా కుటుంబాలు వలస వెళ్లారు.

  7. ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో 950కి 600 కుటుంబాలు, కందనాతిలో 800కి 450 కుటుంబాలు వెళ్లిపోయాయి.

  8. కోటేకల్లులో 550కుగాను 200 కుటుంబాలు వలస బాటపట్టాయి.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 05:36 AM