AP Politics: వల్లభనేని వంశీపై సంచలన కామెంట్లు చేసిన కూటమి నేతలు..
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:51 PM
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలకు తావులేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజల ఎదురుచూపులు త్వరలో నెరవేరుతాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ దుర్మార్గాలు, అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.

గన్నవరం: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) అరెస్టుపై కూటమి నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన మూకలకు చంద్రబాబు సర్కార్ (CM Chandrababu Govt)లో చట్టప్రకారం శిక్షపడుతోందని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే వంశీ అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Vasamsetti Subhash) ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ అండదండలతో వంశీ రెచ్చిపోయారని మండిపడ్డారు.
కక్కిస్తాం..
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వల్లభనేని వంశీ దుర్భాషలాడారని మంత్రి వాసంశెట్టి ధ్వజమెత్తారు. ఆయనకు జైలే సరైన స్థానం అంటూ ఆగ్రహించారు. మానవ జన్మకే మచ్చ తెచ్చిన వంశీకి, రెచ్చిపోతున్న అతని అనుచరులకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో వైసీపీ మూకలు అరాచక చర్యలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జగన్‌తో కలిసి విధ్వంసం సృష్టించిన వంశీ జైల్లోనే ఉండాలని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి విధ్వంసం సృష్టించిన వంశీకి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి అన్నారు. దోచుకున్న కోట్ల రూపాయలు కక్కిస్తామని చెప్పుకొచ్చారు. వంశీ చేతుల్లో కిడ్నాప్‌కు గురైన సత్యవర్ధన్ కుటుంబసభ్యులకు తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. వైసీపీలో ఇలాంటి వారెందరో ఉన్నారని, వారిని గుర్తించి మరోసారి అరాచకాలకు పాల్పడుకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
త్వరలోనే..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలకు తావులేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజల ఎదురుచూపులు త్వరలో నెరవేరుతాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ దుర్మార్గాలు, అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. తప్పు చేసిన వారు కూటమి ప్రభుత్వంలో తప్పించుకోలేరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు నేడు ఫలించాయని, దుర్మార్గుడు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారంటూ సంచలన కామెంట్లు చేశారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని నేరాలు చెయ్యడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.
చట్ట ప్రకారమే..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి దృశ్యాలను ప్రజలందరూ కల్లారా చూశారని తెలిపారు. అయినా సిగ్గు లేకుండా సినిమాల్లో మాదిరి బాధితుడిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అరాచక వాదులపై సత్వర చర్యలు తీసుకోవడం అభినందనీయమని పోలీసులను కొనియాడారు. చట్ట ప్రకారమే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. అన్యాయాలు చేసిన వారిపై ఆధారాలతోనే పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో గుడివాడ మట్టిదోపిడి, భూముల ఆక్రమణ వంటి అంశాలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. గుడివాడ అరాచకాలు, అవినీతిపై త్వరలోనే చర్యలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే రాము చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం..
Gannavaram: వైసీపీ నేతలకు భారీ షాక్.. ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు..