Vijayawada: వందల ఫోన్లు రికవరీ.. మెుబైల్ దొంగతనాలపై సీపీ రాజశేఖర బాబు ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:57 PM
ఆంధ్రప్రదేశ్: సుమారు రూ.50 లక్షల విలువైన 420 ఫోన్లను రికవరీ చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. ఎవరి ఫోన్లు పోయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విజయవాడ: నగర పోలీసులు భారీగా మెుబైల్ ఫోన్లను రికవరీ చేశారు. పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వాటి యజమానులకు అందజేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన 420 మొబైల్స్‌ను రికవరీ చేశారు పోలీసులు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. అలా ఫిర్యాదు చేస్తే సాంకేతికత ఆధారంగా పోయినా లేదా దొంగిలించబడిన ఫోన్‌ను వెంటనే గుర్తించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ.."ఫోన్‌పైనే నేడు ప్రతి మనిషి జీవితం ఆధారపడి ఉంది. బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఫోన్‍తోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి మెుబైల్ అపహరణకు గురైనా లేదా పోయినా వెంటనే సమాచారం ఇవ్వాలి. మేము ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తాం. గతంలోనూ ఇదే విధంగా వేల చరవాణులు గుర్తించి బాధితులకు అందించాం. మరికొన్ని మెుబైల్స్ ఇంకా గుర్తించాల్సి ఉంది. త్వరలోనే వాటినీ స్వాధీనం చేసుకుంటాం.
ఇటీవల ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా పెరిగిపోయాయి. తక్కువ పెట్టుబడి అధిక లాభాల పేరుతో అమాయకులను ప్రలోభ పెడుతున్నారు. ఆశతో పెట్టి ఎవ్వరూ డబ్బులు పోగొట్టుకోవద్దు. మీరు తొలుత కట్టే రూ.10 వేలకు రూ.30 వేలు తిరిగి చెల్లించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత వేలు, లక్షలు మీ ఖాతాల నుంచి దోచేస్తారు. ప్రజలు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. రోడ్ సేప్టీ, సైబర్ సేఫ్టీపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. అలాగే సేప్టీ కల్చర్‌నూ అలవరచుకోవాలి.
విజయవాడలో సురక్ష కమిటీలు బాగా పని చేస్తున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు ఆధ్వర్యంలో కెమెరాలు పెట్టి సురక్ష కమిటీల ద్వారా కేసులు ఛేదించారు. నగరవ్యాప్తంగా 1,260 కెమెరాలు పెట్టాం. మార్చిలోనూ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నాం. అపార్ట్మెంట్ల వద్ద లోపల, బయట సీసీ కెమెరాలు ఉండాలి. బైక్ దొంగిలిస్తే వెంటనే తెలిసేలా సాంకేతికత అందుబాటులోకి తెస్తున్నాం. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడపండి. మీ కుటుంబాలకు మీరే ఆసరా, అండ, దండ అని గుర్తుంచుకోండి" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి
CM Chandrababu: ఎర్రన్నాయుడు తిరుగులేని నాయకుడు: సీఎం చంద్రబాబు